ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రత్యేక కథనం
ఇందూరు నుండి హస్తినకు తగిలిన సెగ
పార్లమెంట్ సాక్షిగా కాగుతున్న రాజకీయం
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్
పసుపుబోర్డు ఇవ్వమని తేల్చేసిన కేంద్రం
అరవింద్‌పై టీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు
ఉత్తమ్‌పై నిప్పులు చెరిగిన అరవింద్
కాంగ్రెస్‌ను టీఆర్ఎస్కు అమ్మేస్తారని వ్యాఖ్య
హైదరాబాద్, పసుపుమంటలు.. ఇందూరు నుండి హస్తినకు తాకాయి. పార్లమెంట్ సాక్షిగా పసుపురాజకీయం భగభగలాడుతోంది. నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటుకు సంబం ధించి సోమవారం రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్‌రెడ్డి, మంగళవారం లోక్‌సభలో కాంగ్రె స్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నలు సంధించగా.. పసుపుబోర్డు ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్పైసెస్ ఎక్స్ టెన్షన్ సెంటర్లోనే పసుపుకు సంబంధించిన అంశం కూడా ఉందని చెప్పింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు 2019 ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు.. ఈ సందర్భంగా జరిగిన చర్చ తెలంగాణ రాజకీయాలను కూడా హాట్ హాట్‌గా మార్చింది. స్పైసెస్ ఎక్స్ టెన్షన్ సెంటర్ వచ్చిన సంద ర్భంలోనే.. పసుపుబోర్డుపై కేంద్రం తన వైఖరిని బద్దలు కొట్టగా, ఇటీవల నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సిందే అంటూ దీక్షలకు, ఆందోళనలకు దిగారు. వారితో అరవింద్ చర్చలు కూడా జరిపారు. తర్వాత పసుపు ధర కొంత మెరుగుపడడంతో రైతులు కాస్త నెమ్మదించారు. ఇపుడు పార్లమెంట్ సాక్షిగా అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పసుపుబోర్డు డిమాండ్‌ను పతాకస్థాయికి తీసుకెళ్ళగా, కేంద్రం చేసిన ప్రకటనపై.. మండిపడుతున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర కావాలా.. పేరు కావాలా అంటూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల ఉత్తమ్ ప్రశ్నపై స్పందించారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల సమాధానమిస్తూ.. స్పైసెస్ బోర్డ్ (మసాలా బోర్డు) పరిధిలో పసుపుతో పాటు మొత్తం 50 పంటలున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే పసుపు కోసమే మసాలా బోర్డు డివిజనల్ కార్యాలయాన్ని రీజనల్ కార్యాలయంగా మార్చి ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యాలయం పసుపు పంట మీదనే దృష్టి పెట్టి పనిచేస్తుందని వివరణ ఇచ్చారు. ఇక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గురించి చేసిన ఆరోపణలకు బదులిస్తూ.. పసుపు పంటకు ధరలు తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొస్తే.. అప్పుడు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. అటు ఉత్తమ్, ఇటు కేంద్ర మంత్రి మధ్య హాట్ హాట్‌గా చర్చ జరగ్గా, అదే సమయంలో తెలంగాణ అసెంబ్లిd సమావేశాల సందర్భంగా సభకు హాజరైన నిజామాబాద్ ఎమ్మెల్యేలు కూడా పసుపుబోర్డు అంశంపై మాట్లాడారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపురైతుకు దన్నుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిం చిందన్నారు. పసుపుబోర్డు రాదనేది.. కేంద్రం ప్రకటనతో తేలిపోయింది.. ఇక తేల్చుకోవాల్సింది రైతులే. హామీనిచ్చి నిలబెట్టుకోలేని ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లపై ఎంపీ అరవింద్ విరుచుకుపడ్డారు. మరోవైపు కవిత ఎంపీగా ఉన్నపుడు పసుపురైతులకు మద్దతుగా ఎంతో కృషిచేసిందని, అరవింద్ పసుపురైతులను వంచించారని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. పసుపు రాజకీయం మూడుపార్టీల మధ్య వేడి పుట్టిస్తోంది.
ఇదీ కేంద్రం వాదన
పసుపుతోపాటు అన్నిరకాల మసాలా దినుసుల పంట లను విక్రయించడం, ఎగుమతి చేయడం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్‌తో కలిసి ‘ఈ-స్పైస్ మండీ’ ఏర్పాటు చేస్తున్నా మని, ఇందులో తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి 5,000 మంది రైతులు నమోదు చేసుకున్నారని కేంద్రమంత్రి రూపాల ప్రకటించారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల రైతులకు ఈ-స్పైస్ మండీ ఉపయోగపడుతుందని తెలిపారు. పసుపుతో పాటు ఇతర మసాలా దినుసులపై పరిశోధన, అభివృద్ధి, సాగు విధానాలు, మార్కెటింగ్, ఎగుమతులను ప్రోత్సహించడం కోసం నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తుంది. ‘మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్స కింద కేంద్ర వ్యవసాయశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. పోస్ట్ హార్వెస్టింగ్ పనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తోంది. తద్వారా పసుపు పంటకు మెరుగైన ధర లభించేందుకు స హకరిస్తోంది. ‘నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈనామ్) ద్వారా ఇటు రైతులు, అటు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పిస్తోంది.
కావాలనే రాద్ధాంతం – ఎంపి అరవింద్..
కేంద్ర ప్రభుత్వం ‘పసుపు బోర్డు’ కంటే మెరుగైన, మరింత ప్రయోజనకరమైన కార్యాల యాన్నే ఏర్పాటు చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో పసుపు బోర్డు గురించి ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం పసుపు బోర్డు కంటే మెరుగైన ‘స్పైసెస్ ఎక్స్టెన్షన్ సెంటర్’ ఏర్పాటు చేసి, రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటు నందిస్తుంటే, కాంగ్రెస్ ఎంపీలు కేసీఆర్ స్క్రిప్ట్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ టీఆర్ఎస్ పార్టీకి అమ్మేస్తారని, భవిష్యత్ ఉన్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని అరవింద్ వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలేనని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో ముం దు చెప్పి, ఆ తర్వాత ఆరోపణలు చేయాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం కేసీఆర్‌కు తొత్తుగా మారారని, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు లొంగిపోయినట్లే కనిపి స్తోందని అన్నారు.
ఎంపి అరవింద్ రాజీనామా చేయాలి – ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందవ్ తన పదవికి రాజీనామా చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తన ట్విట్టర్లో పోస్టింగ్ పెట్టారు. ” గుడ్‌మార్నింగ్ ఎంపీ అరవింద్ జీ. మీ రాజీనామా కోసం ఆర్మూరు రైతులు ఎదురుచూస్తున్నారు. వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపుబోర్డు ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనండి. ధన్య వాదాలు.” అని ట్వీట్ చేశారు. చేయడంతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో నిజామా బాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ అరవింద్ రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ప్రస్తుతం బోర్డు ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎంపీ అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీమ్స్, ట్వీట్ల వర్షం వెల్లువలా కొనసాగుతోంది. రైతులను మోసం చేసిన ఎంపీ అరవింద్ మోసగాడు అంటూ వేలాది మంది ట్వీట్లు చేస్తున్నారు.
పసుపురైతుకు సోషల్ మీడియా తోడు
పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమంటూ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ప్రకటనపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో, గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ రెండేళ్లుగా రైతులను మోసం చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్‌రెడ్డి పసుపు బోర్డు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించగా, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే అవకాశమే లేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టంచేశారు. దీంతో మండిపడ్డ నెటిజన్లు నిజామాబాద్ పసుపు రైతులకు అండగా నిలబడి పసుపు బోర్డు ఎక్కడ.. రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు ఎంపీగారు అంటూ పోస్టులు పెట్టారు. పసుపు బోర్డు అంటూ మోసం చేసిన ఎంపీ అరవింద్‌ను ‘మోసగాడు అరవింద్’ (ఛీటర్ అరవింద్) అంటూ వేలాది మంది నెటిజన్లు ట్వీట్ చేశారు. అరవింద్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.