ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రత్యేక కథనం….
హైదరాబాద్ : సంక్షేమ పథకాలకు లోటు లేకుండా కేటాయింపులు పెంచుతూనే కొత్త పథకాలకు నిధులను సమకూర్చేలా రాష్ట్ర వార్షిక బడ్జెట్ సిద్దంగా ఉంది. కేంద్రంనుంచి రావాల్సిన పన్నుల వాటాలో కోతలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో తగ్గుదలతోపాటు కరోనా కారణంగా భారీగా తగ్గిన సొంత వనరుల రాబడి కారణంగా ఇప్పటికే ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి అంచనాలను భారీగా పెంచుతూ సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చేలా బడ్జెట్ సిద్దమైంది. పన్నేతర ఆదాయంలో భాగంగా భూములు, ఇండ్లు, ఇతర ప్రభుత్వ ఆస్తుల విక్రయంతోపాటు భూముల విలువల సవరణ, ఇతర మార్గాలను అమలులోకి తేనున్నారు. గనులు, ఇసుక వంటి వాటిపై రాయల్టి లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీలపై ఆదాయం అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఎన్నికల హామీల అమలుకు కొంత కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ రుణ మాఫీ, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయయో పరిమితి 65ఏళ్లనుంచి 57ఏళ్లకు తగ్గింపు, ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంపు, నిరుద్యోగులకు రూ. 3016 భృతి వంటివాటిపై బడ్జెట్‌లో స్పష్టత రానుంది. వ్యవసాయ రుణమాఫీకి రూ. 6వేల కోట్లు, పింఛన్ల అర్హత వయసు 57ఏళ్లకు తగ్గిస్తే కొత్తగా అర్హత సాధించనున్న 8.5 లక్షల మందికి ఏటా రూ. 2500కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది.
వాస్తవికతకు దర్పణం పట్టేలా రూపొందించిన తెలంగాణ వార్షిక బడ్జెట్ రాబడుల తగ్గుదల నేపథ్యంలో 2021-22 వార్షిక ఏడాది బడ్జెట్ పద్దుల వారీగా కేటాయింపులపై మేధోమథనం పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల అనుసారం భారీ వ్యయంతో కూడిన పనులను పక్కనపెట్టి పూర్తయ్యే దశలోని ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు నిధుల కోత లేకుండా, వృధా నిధులను, కేటాయింపులను నియంత్రించేలా కార్యాచరణ సాగుతోంది. ఈ ఏడాది అంచనా రాబడుల్లో స్వీయ వనరులనుంచి రూ. 47119కోట్లు, కేంద్ర పన్నుల వాటానుంచి రూ. 4829 కోట్లు, కేంద్ర పథకాల్లో కోతలు రూ. 802కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు బడ్జెట్ పద్దులను ఇంత మేర సవరించనుంది. ప్రస్తుత ఆర్ధిక ఏడాదిలో మొత్తం రాబడులను రూ. 1,15,900కోట్లుగా అంచనా వేస్తూ మొత్తం వ్యయాలు రూ. 1లక్ష కోట్లుగా ప్రతిపాదించారు. అయితే వ్యయాలు భారీగా పెరగ్గా, ఏడాది పూర్తయ్యే నాటికి రాబడులు రూ. 68,781 కోట్లే రానున్నాయని అంచనా వేశారు.
హామీలకు కీలక నిధులు…
ఆసరా పెన్షన్లను రెట్టింపు చేసిన ప్రభుత్వం వికలాంగులకు రూ. 1500నుంచి రూ. 3016కు, మిగిలిన అన్ని రకాల పెన్షన్లను రూ. 1000నుంచి రూ. 2016కు, బీడి కార్మికుల కటాఫ్ తేదీ మార్చి 2018కి పొడిగించడం, వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65ఏళ్లనుంచి 57ఏళ్లకు తగ్గించడం వంటివాటిపై స్పష్టత తేనున్నారు. గడచిన 2019-20 వార్షిక బడ్జెట్‌ను వాస్తవిక వ్యయం ప్రాతిపదికగా రూపొందించగా, రాష్ట్ర ఆవిర్భావం నుంచిఏటా అంతక్రితపు ఏడాది అంచనాలకంటే 10నుంచి 12శాతం పెంపుతో బడ్జెట్‌లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా ఉండగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర 2020-21 వార్షిక బడ్జెట్ రూ. 1,82,914 కోట్లతో 29శాతం పెరుగుదలతో అంచనా వేశారు.
పథకాలకు నిధులు ఇలా…
రైతు రుణమాఫీ మార్చిలో రూ. 1198 కోట్లు
ఈ ఏడాది రూ. 6225కోట్లు
ఆసరా పించన్లు రూ. 11758కోట్లు
రైతుబంధు రూ. 14వేలకోట్లు
రైతు బీమా రూ. 1141కోట్లు
మార్కెట్ ఇంటర్వెన్షన్ రూ. 1000కోట్లు
మైక్రో ఇరిగేషన్‌కు రూ. 600కోట్లు
రైతు వేదికలకు రూ. 350కోట్లు
పాడి రైతు ప్రోత్సాహాకం రూ. 100 కోట్లు
సాగునీటిరంగం రూ.11054కోట్లు
ఎస్సీ ప్రత్యేక ప్రగతి రూ.16534కోట్లు
ఎస్టీ ప్రగతినిధి రూ. 9771కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.1518కోట్లు
మత్య్స శాఖ రూ.1586కోట్లు
ఎంబీసి కార్పొరేషన్‌కు రూ. 500కోట్లు
మహిళా సంఘాల వడ్డీలేని రుణాలకు రూ.1200కోట్లు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లు ఇలా …
ఏడాది బడ్జెట్ పెరుగుదల, తగ్గుదల
2014-15 100637
2015-16 1,15,689 15శాతం
2016-17 1,30,415 13శాతం
2017-18 1,49,646 15శాతం
2018-19 1,74,453 17శాతం
2019-20 1,42,152 -19శాతం
2020-21 1,82,914 29శాతం