Tuesday, November 19, 2024

వ‌డ్డీతో స‌హా బ‌దులిస్తాం – విప‌క్షాల‌కు కెటిఆర్ వార్నింగ్..

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి వ‌డ్డీతో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో జ‌రిగిన‌ టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘వాట్సప్‌ వర్సిటీలో బీజేపీ నాయకులు అబద్దాలు నేర్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. విద్యారంగానికి కేంద్రంలోని బీజేపీ చేసింది గుండు సున్నా. రాష్ట్రానికి రావాల్సిన సంస్థలను కూడా ఇవ్వట్లేదు. తెలంగాణకు నవోదయ విద్యాలయాలు కూడా దక్కలేదు. కొత్త వైద్య కళాశాలల్లోనూ తెలంగాణకు మొండిచెయ్యి చూపారు. తెలంగాణ పట్ల వివక్ష చూపిన బీజేపీకి ఓటేందుకు వేయాలి. విశాఖలో ఉక్కు పరిశ్రమను మూసేస్తున్న వారు బయ్యారంలో పరిశ్రమ కడతారా అంటూ ఒకడు ఎగిరెగిరి ఏమైపోయాడో తెలుసు. అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు తడాఖా చూపుతాం.  మేము గణాంకాలతో అభివృద్ధి గురించి చెబితే బీజేపీ మాటలు మాత్రమే చెబుతోంది. మేము ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడితే మోడీ పకోడీల గురించి మాట్లాడుతారు. బీజేపీ నేతలకు తెలంగాణ దేశంలో భాగంగా ఉందని కనిపించడం లేదా?  మోడీ మాటలు కోట్లల్లో ఉంటాయి.. చేతలు పకోడీల్లా ఉంటాయి (బాత్ కరోడోమే – కామ్ పకోడీమే). మోడీ 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజి అన్నారు.. ఒక్కరికైనా ఏమైనా వచ్చిందా? చంద్రబాబు ఒక వైపు, చరిత్ర ఉన్న కాంగ్రెస్ మరో వైపు, తెలంగాణ కోసం విఫలమైన పోరాటాలు ఇంకో దిక్కు. తెలంగాణ అంశమే తెరమరుగైన పరిస్థితులు అప్పుడు. కేసీఆర్ అప్పుడు చంద్రశేఖర్ రావు మాత్రమే. ఒక మెదక్ జిల్లాకు మాత్రమే తెలుసు. మీడియా, మనీ, మజిల్ పవర్ కేసీఆర్ కు అపుడేమి లేవు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో కేసీఆర్ ఒక్కడిగా ఇరవై యేండ్ల క్రితం టీఆర్ఎస్ స్థాపించారు. ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తన పదవులను గడ్డిపోచలా త్యాగం చేసి.. లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్ళ తో కొట్టి చంపండి అని అన్న దమ్మున్న నేత కేసీఆర్. తెలంగాణను గేళి చేసిన పరిస్థితుల్లో కేసీఆర్ ఒక్కడిగా ప్రయాణం ప్రారంభించారు. నిరాశ కల్పించినా కేసీఆర్ కుంగిపోకుండా తెలంగాణ సాధించారు. అలాంటి కేసీఆర్ గారిని గౌరవం లేకుండా కొందరు మాటాడుతున్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ ది.. మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. గోడకు వేలాడ దీసే తుపాకీ మౌనంగా ఉంటుంది..టైం వచ్చినపుడు తుపాకీ విలువ తెలుస్తుంది. దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తాం. ఒకడు ఎగిరెగిరి ఏమై పోయాడో తెలుసు. అందరీ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి.   ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు ద్వారా బీజేపీకి సమాధానం చెప్పాలి’ అని విజ్ఞప్తి చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement