హైదరాబాద్ : ప్రశ్నించే ముందు ఆలోచించాలని కోరారు మంత్రి కెటిఆర్. బేగంపేట్ హరిత ప్లాజాలో తెలంగాణ జీవితం – సామరస్య విలువలపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 2016లో కేంద్రం ఇచ్చిన పీఆర్సీ కేవలం 14 శాతం మాత్రమే అని స్పష్టం చేశారు. 14 శాతం పీఆర్సీ ఇచ్చినోడు వచ్చి 43 శాతం పీఆర్సీ ఇచ్చిన వారిని ప్రశ్నించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులకు ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్. 100 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారన్నారు. జర్నలిస్టు మిత్రుల కోసం కూడా రూ. 100 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్‌లో 1000 మంది అక్రిడెట్ జర్నలిస్టులు, తమిళనాడులో 2500 మంది ఉంటే తెలంగాణలో 19 వేల మంది అక్రిడెట్ జర్నలిస్టులు ఉన్నారని వివరించారు. జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అంటూ ఇలాంటి పరిస్థితి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉందా? అని ప్రశ్నించారు. విద్యార్థుల పోరాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని కేటీఆర్ అన్నారు. విద్యార్థి నాయకులతో పాటు మిగతా వారందరూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారన్నారు. విద్యార్థులు, అడ్వకేట్లు, జర్నలిస్టు మిత్రులతో తమకున్నది మామూలు అనుబంధంకాదని, అలాగే రాజకీయ సంబంధం కూడా కాదని .. తమది పేగుబంధం అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడింది విద్యార్థులు, జర్నలిస్టులే అని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, రాష్ర్ట గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కుపై నోరు చూసుకుని కూర్చోలేం..
మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు అంశంపై మరోసారి స్పందించారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని విమర్శించారు. తాను విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందిస్తుంటే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, విశాఖ ఉక్కు సంగతి నీకెందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏపీ సంగతులతో నీకేం పని అంటున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ దేశంలో మాకు భాగస్వామ్యం లేదా? మాకు నోరు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇవాళ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్ఈఎల్ పైనా పడతారు. ఏపీలో సంగతి మాకెందుకని నోరు మూసుకుని కూర్చోలేం. రేపు తెలంగాణకు కష్టం వస్తే మావెంట ఎవరుంటారు? మాకెందుకులే అనే పట్టింపులేని తత్వం మంచిది కాదు. మనం మొదట భారతీయులం… ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి” అని అన్నారు.