హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ విజయవంతమైన పథకాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం మంచినీళ్ల కోసం రూ.4,198 కోట్లు ఖర్చు చేస్తే ఆరున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.32,500 కోట్లు ఖర్చు చేసిందని అసెంబ్లీలో వెల్లడించారు. కేవలం మాటలు చెప్పకుండా చేతల్లో చేసి చూపించామన్నారు. ఇవాళ రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 ఏళ్లలో 17,769 మంచినీటి ట్యాంకులు నిర్మిస్తే.. తెరాస కేవలం ఐదేళ్లలోనే 19,233 ట్యాంకులను నిర్మించినట్లు చెప్పారు. పాతవి, కొత్తవి కలిపి రాష్ట్రంలో ఉన్న 37,002 ట్యాంకుల ద్వారా సురక్షిత నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో కూడా ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథలో ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే అధికారులు వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. వంద శాతం రాష్ట్రంలో ఇంటింటికీ నీటిని అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ.. అని కేంద్ర జల్‌శక్తి మిషన్ చెప్పిందని గుర్తు చేశారు.‘‘కాకతీయ రాజుల కాలంలో సుమారు 75వేల చెరువులు ఉండేవి. సమైక్య పాలకుల నిర్లక్ష్యం, మౌనం కారణంగా రాష్ట్రంలో కేవలం 46 వేల చెరువులు మాత్రమే మిగిలాయి. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పటిష్టం చేశాం. భారీ వర్షాలు పడినా ఒక్క చెరువు కూడా తెగకుండా పూర్తిగా నిండిపోయాయి. దీని ద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు రాష్ట్రంలో వెయ్యి అడుగులు వేసినా నీరు రాని పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో బోర్లు వేసే అవసరం కూడా లేకుండా పోయింది. ఎండా కాలంలో కూడా చెరువులు నింపి కాలువల ద్వారా నీళ్లు అందిస్తున్నాం. ప్రాజెక్టుల పునరాకృతి వల్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని 230 టీఎంసీలకు పెంచాం. పాలమూరు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 91.2 టీఎంసీలకు పెంచాం’’ అని వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement