బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు భారీ నిధులు
ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెల పథకం
పెరగనున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు
కుల వృత్తులకు బడ్జెట్లో పెద్దపీట
హైదరాబాద్, : సంక్షేమ రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఈ రంగాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలను ఇస్తామని ఇందుకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నానని ఆయన బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధా నమిస్తూ ప్రకటించారు. వ్యవసాయ రంగానికి ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల రూపాయలను కేటాయించి ఖర్చు చేశామని ఈ బడ్జెట్లో ఈ రంగానికి మరిన్ని నిధులు సమకూరుస్తామని చెప్పారు. పాలీహౌస్‌ల నిర్మాణానికి వందకు వంద శాతం సబ్సిడీ ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని ప్రజలకు పోషకమైన కూర గాయలు, ఆకుకూరలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలన్న సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. రైతుబంధు, రైతుబీమాతో పాటు రైతన్నలకు లబ్ధి చేకూర్చేందుకు ఒకటి, రెండు కొత్త పథకాలను ఈ బడ్జెట్లో ప్రకటిం చేందుకు ప్రభుత్వం సమాయత్తమ వుతున్నట్టు తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ఇప్పటిదాకా కేటాయిస్తూ వచ్చిన నిధులను పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్‌ప్లాన్ కింద ఖర్చు చేయని నిధు లను వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వృత్తి విద్యా కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, గురు కుల పాఠశాలల్లో చదివే వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలకు కేటాయి స్తున్న నిధులను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోధనా ఫీజుల పథకానికి ఇప్పుడిస్తున్న నిధులను అవసరమైన మేర పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఈ పథకం అమలుకు ప్రస్తుతమున్న విధానాన్ని పూర్తిగా మార్చాలని విద్యార్థి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసి బ్యాంకు చుట్టూ తిరగ కుండా ఉండేందుకు వీలుగా నూతన పద్ధతికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థి ప్రవేశం పొందిన రోజునే ఆ వివరాలను కంప్యూటర్ ద్వారా నేరుగా సంక్షేమ శాఖకు చేరే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని అక్కడి నుంచి విద్యార్థి బ్యాంకు ఖాతాలోకి నగదు జమయ్యే కొత్త విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో నిధులను కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
పోలీస్ శాఖను మరింత ఆధునీకరించి శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కూలడానికి సిద్ధంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ కార్యాలయాలకు కొత్త భవనాలను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళితే ఇప్పుడిస్తున్న రూ.20 లక్షలను కొంత పెంచడంతో పాటు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్యను బట్టి అర్హతను నిర్ణయించాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం మీద ఆర్థిక మంత్రి హరీష్‌రావు గురువారం ప్రవేశపెట్టే బడ్జెట్ జనరంజకంగా, బడుగు బలహీన వర్గాలు, రైతుకు బాసటగా నిలిచేదిగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్లో మరిన్ని కొత్త పథకాలను ప్రకటించడంతో పాటు వాటికి అవసరమైన నిధులను కేటాయిస్తు న్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.