Friday, November 22, 2024

ధ‌ర‌ణితో భూ ఫోక‌స్….

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం
దరాబాద్‌, : ధరణిలో ప్రభుత్వ భూములను చేర్చి కాపాడి పరిరక్షించేలా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. సర్కారీ భూముల లెక్క తీసి సర్వే నంబర్లను ధరణిలో పొందుపర్చి చేతులు మారకుండా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని అసైన్డ్‌, దేవాదాయ., వక్ఫ్‌, అటవీ భూములను పరిరక్షించేందుకు తాజాగా చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని 41.75 లక్షల ఎకరాల అటవీ భూములు, 22.42 లక్షల ఎకరాల అసైన్డ్‌, 0.74లక్షల ఎకరాల దేవాదాయ, 0.45 లక్షల ఎకరాల వక్ఫ్‌é భూములను, 21.04 లక్షల ఎకరాల ఇతర భూములను రికార్డుల్లో చేర్చేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 22,63,139 ఎకరాల అసైన్డ్‌ భూములకు చెందిన 15.83 లక్షల మందికి భూ యాజమాన్య హక్కులు పరిశీలించి వాస్తవాలు తేల్చనున్నారు. ఇదివరకే కులాల వారీగా కూడా లబ్ధిదారుల వివరాలు గుర్తించారు. వివిధ వర్గాల వారీగా 4,79,897మంది ఎస్సీలకు 5,62,789 ఎకరాలు, 3,08,048మంది ఎస్టీలకు 6,66,037 ఎకరాలు, 6,14,325 మంది బీసీలకు 7,90,679 ఎకరాలు, 37,879 మంది మైనారిటీలకు 54,625 ఎకరాలు, 1,05,183మంది ఓసీలకు 1,42,733 ఎకరాల భూమిని అసైన్డ్‌ చేసింది. ఇందులో 84,706 ఎకరాల భూమి ఇతరుల చేతుల్లో ఉన్నట్లుగా నిర్ధా రించిన సర్కార్‌ వాటిపై సమగ్ర వివరాలు సేకరించింది. 1,85,101 ఎకరాలతో అసిఫాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 1,66,557 ఎకరాలు, నల్గొండలో 1,38,686 ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి.
98 వేల ఎకరాలు ఆక్రమణ…
జిల్లా కలెక్టర్ల నుంచి సేకరించిన సమాచారం మేరకు 98 వేల అసైన్డ్‌ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లుగా గుర్తించారు. అన్యాక్రాంతం ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరిగినట్లుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. రంగారెడ్డి పూర్వపు జిల్లా పరిధిలో దాదాపు 6500 ఎకరాల అసైన్డ్‌ భూమి ప్రైవేటు పరం అయినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. ఉప్పల్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో భూములకు ఉన్న అధిక ధరల కారణంగా విలువైన అసైన్డ్‌ భూములు చేతులు మారాయి.
పోడు భూములు కూడా…
దాదాపు 6 లక్షల ఎకరాల్లో గిరిజనులు, ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని అంచనా. ఈ భూముల్లో తమకు పట్టాలు ఇవ్వాలని షెడ్యూల్‌ తెగలు, ఇతర ఆదివాసీలు అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 కింద లక్షా 83వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ఆదివాసీలతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. అయితే 93,639 మంది ఆదివాసీలకు 3,00,284 ఎకరాల భూములకు చెందిన అటవీ హక్కు పత్రాలిచ్చారు. ఇంకా 90 వేల మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు.
అటవీ భూముల లెక్క పక్కా…
రాష్ట్రంలోని భూభాగంలో 33 శాతం అటవీ భూమి ఉందని ఒక అంచనా. ఈ రికార్డులకు లెక్కలు లేకపోగా రెండు శాఖల మధ్య భిన్నమైన వివరాలు నమోదయ్యాయి. అటవీ భూములకు చెందిన 41.75 లక్షల ఎకరాల్లో వివాదాలు లేకుండా పక్కాగా ఉండగా, 25 లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది. జయశంకర్‌ భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, అసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అటవీ భూముల వివాదాలు ఎక్కువగా నెలకొని ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 1583 దేవాదాయ శాఖకు చెందిన భూముల అంశాలపై ట్రిబ్యునల్‌లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, సికింద్రాబాద్‌లలో అత్యధికంగా ఆలయ భూములు పరాధీనమైనట్లు సమాచారం. వీటిపై కేసులు ఇంకా విచారణలో ఉండగా, తాజాగా అధికారులు పోరాటం ఉధృతం చేశారు. దూపదీప నైవేద్యాల కోసమని దేవుడికి దానంగా ఇచ్చిన మాన్యాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలని సర్కార్‌ ఆదేశించడంతో ఆ దిశగా దేవాదాయ శాఖ కృషి ఆరంభించింది.
దేవాదాయ శాఖలో 84వేల ఎకరాలు…
రాష్ట్రంలోని 12 వేల దేవాలయాలకు దాదాపు 84,195 ఎకరాల భూములున్నాయని రికార్డుల ప్రక్షాళనలో వెల్లడైంది. కానీ వీటిపై యాజమాన్య హక్కులు మాత్రం రెవెన్యూ రికార్లుల్లో దేవాదాయ శాఖ పేరు మీద లేవు. మరోవైపు కాస్రా పహాణీ, కబ్జా కాలంలో ఇతరులు పేర్లు వస్తుండటంతో న్యాయపరమైన వివాదాలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement