మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వ్యాప్తి
జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
కరీంనగర్, మంచిర్యాల ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా
హైదరాబాద్, : పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కరోనా సెకండ్‌వేవ్ తెలంగాణకు విస్తరిస్తోంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి సరిహద్దు రాష్ట్రాలకు వైరస్ వేగంగా విస్తరిస్తోన్న సంకేతాలు కనిపిస్తు న్నాయి. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనైతే దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలకు తెలంగాణకు ఆనుకునే ఉండడంతో ఇక్కడ కూడా చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య వారం రోజులుగా పెరుగుతోంది. ఆదినుంచి కరోనా వైరస్‌కు ఆలవాలమైన హైదరాబాద్‌లోనూ రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మార్చి 13న ఏకంగా 46 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కరీంనగర్, మంచిర్యాల పట్టణాల్లో కరోనా కేసులు కలకలంరేపుతున్నాయి. కరీంనగర్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న చెందిన నలుగురు ఉపాధ్యాయులు, మరో ఇద్దరు కరోనాబారిన పడ్డారు. అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు విస్తృతంగా కరోనా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 14మందికి కరోనా సోకింది. 11 మంది ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం వడ్డించే ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణా పరీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో యూకే స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకడంతో… అతడి శాంపిళ్లను జిల్లా వైద్యాధి కారులు ల్యాబ్కు పంపారు. ముందు జాగ్రత్తగా అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. ఇరుగు పొరుగు వారికి కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు.
జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలి. లేనిపక్షంలో కరోనా మరోసారి విరుచుకపడడం ఖాయం. ఆరుబయట ప్రదేశాల్లో తిరిగినపుడు తప్ప నిసరిగా మాస్కు ధరించాలి. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. వెళ్లాల్సి వచ్చినా… ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. ఏమాత్రం కరోనా లక్షణాలు ఉన్నా… దగ్గర్లోని పీహెచ్‌సీకి వెళ్లి కరోనా టెస్టు చేయించుకోవాలి. – రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జీ. శ్రీనివాసరావు
తెలంగాణాలో తిరిగి విస్తరిస్తున్న కరోనా..
Advertisement
తాజా వార్తలు
Advertisement