Tuesday, November 26, 2024

ఓట్ల సాగులో హామీల వ‌ర్షం….

  • ప్రశ్నిస్తామని కొందరు.. పరిష్కరిస్తామని కొందరు
  • నమ్మకానికే పట్టభద్రుల ఓటు
  • చాలా చేశాం.. ఇంకా చేస్తామంటున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ
  • పీఆర్‌సీ, ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు, కొత్త నోటిఫికేషన్లు.. రకరకాల హామీలు
  • ప్రశ్నిస్తామంటున్న విపక్ష అభ్యర్థులు
  • ఆరునెలలకోసారి రిఫరెండం పెట్టమంటున్న వాణీదేవి

హైదరాబాద్‌, : ఎన్నికలన్నాక.. హామీలు మామూలే. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు హామీల వరద పారిస్తున్నారు. గత అసెంబ్లిd ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన కాంగ్రెస్‌, బీజేపీలను కాదని ప్రజలు లక్ష రుణమాఫీ హామీనిచ్చిన టీఆర్‌ఎస్‌కు పట్టంగట్టారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతకుముందెన్నడూ రాజకీయపార్టీలు పెద్దగా హామీలిచ్చిన సందర్భం లేదు. 71మంది అభ్యర్థులున్న.. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ ఐదారుగురి నడుమే ఉంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గత ఆరేళ్ళలో ప్రభుత్వం చేసిన పనిని ప్రామాణికంగా తీసుకుని, కొన్ని డిమాండ్లు నెరవేర్చడం ఆలస్యమైనా మనస్ఫూర్తిగా నెరవేర్చేపార్టీగా టీఆర్‌ఎస్‌ను పలు సంఘాలు పేర్కొంటున్నాయి. పీఆర్‌సీ ఇంకా ప్రకటించలేదు.. ప్రకటించాల్సింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. మెరుగైన పీఆర్‌సీ కోసం, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, వేతనాల పెంపుకోసం, ప్రభుత్వసంస్థల రక్షణ కోసం టీఆర్‌ ఎస్‌కు మద్దతుగా నిలవాలని ఆ పార్టీ కోరుతోంది. ఎవరి సమస్య అయినా పరి ష్కరించే సత్తా, పరిష్కార కేంద్రానికి తీసుకువెళ్ళే సామర్థ్యం టీఆర్‌ఎస్‌కే ఉం దంటున్నారు. ఇక విపక్షాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా చెప్పుకుం టున్నాయి. అటు నల్లగొండలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఇటు హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌తోపాటు బరిలో ఉన్న దాదాపు 160 మంది అభ్యర్థులు ప్రశ్నించే గొంతుకలుగానే చెప్పుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీల ప్రధాన స్లోగన్‌.. అదే అయింది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, విద్యాసంస్థల సమస్యలు, ఇతర వృత్తుల సమస్యలు పరిష్కరిస్తానని పల్లా రాజేశ్వరరెడ్డి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలకు అనుగుణంగా హామీలిస్తున్నారు.
రిఫరెండాలు.. బాండ్‌ పేపర్‌లు
సిట్టింగ్‌ ఎమ్మెల్సీల ప్రచారం ఒకలా ఉంటే.. తొలిసారి గెలుపు కోరుకుంటున్న అభ్యర్థుల ప్రచారం మరోలా ఉంది. తనను గెలిపిస్తే ఆరునెలల తర్వాత రిఫరెండం పెడతానని, తన పనితీరుపై పట్టభద్రులు సంతృప్తిగా లేకుంటే రాజీనామా చేస్తానని హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి ప్రచారం చేస్తున్నారు. నల్లగొండలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న తీన్మార్‌ మల్లన్న కూడా.. ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు. రెండు బాండ్‌ పేపర్లు పట్టుకుని.. ఒకటి తాను గెలిస్తే.. కట్టుబట్టలు మినహా ఇతర ఏం ఉన్నా అవి ప్రజలకే చెందుతాయని, రెండోది తాను చెప్పిన హామీలు నెరవేర్చకుంటే, రెండున్నర సంవత్సరాల తర్వాత రెఫరెండం పెట్టి.. ప్రజలు వద్దనుకుంటే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. బాండ్‌ పేపర్లు, రిఫరెండాలతో ఓటర్లలోకి వెళుతున్నారు. ఇక పట్టభద్ర ఎన్నికల సమయంలో.. రాష్ట్రంతో సంబంధంలేని జాతీయ అంశాలు చర్చకు పెట్టారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ వంటి అంశాలే కాక.. పెట్రోల్‌, డీజెల్‌ ధరల వంటి అంశాలపై విస్తృతంగా చర్చలో పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, నేతలు కొన్నిచోట్ల పెట్రోల్‌, డీజెల్‌ ధరలు తగ్గిస్తామని హామీనిస్తుండగా, స్వతంత్ర పార్టీలు.. నిరుద్యోగభృతి అందజేస్తామని, వేతనాలు డబుల్‌ చేస్తామని స్వతంత్ర అభ్యర్థులు కూడా చెబుతున్నారు. నోటికొచ్చి ందే హామీ అన్నట్లుగా.. అభ్యర్థులు ఓట్ల సాగులో ముందుకు వెళుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement