హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పసుపు బోర్డుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు రైతులు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ. సాగర్ డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మని దగ్థం చేశారు. గత ఎన్నికల సందర్భంగా.. పసుపు బోర్డు తేలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులు, ప్రజల పక్షాన పోరాడుతానని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే అర్వింద్ ఎంపీగా గెలిచిన రెండేండ్లయినా పసుపు బోర్డు తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటే చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంటులో ప్రకటించారని, అందువల్ల ఎంపీ అర్వింద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రంలో లక్షా 40 వేల ఎకరాల్లో పసుపు సాగు అవుతున్నదని, రైతులు ఎగుమతి చేయగలిగే నాణ్యమైన పసుపు పండిస్తున్నారని ఆయన చెప్పారు. అయినా మద్దతు ధర లభించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పసుపు బోర్డు ద్వారా తప్పనిసరిగా మద్దతు ధర లభిస్తుందని రైతులు భావిస్తున్నారని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించిందని ఆవేదన వ్యక్తంచేశారు
Advertisement
తాజా వార్తలు
Advertisement