Wednesday, November 20, 2024

ఉచిత విద్యుత్ ప‌థ‌కం వై ఎస్ ఆర్ దే – కెసిఆర్

హైదరాబాద్: త‌మ ప్ర‌భుత్వం చేసిన విష‌యాల‌నే చెబుతామ‌ని, అలాగే మంచి ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన వారిని సైతం ప్ర‌శంసిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆన్నారు.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ఆయ‌న ప్ర‌సంగిస్తూ, ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదేన‌ని ప్ర‌స్తావించారు.. అన్నింటిని తామే అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు. కాగా గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా విషయంలో గతంలో కూడా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. అలాగే పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్‌నిర్మిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఉన్న రూ.200 పెన్షన్‌ను రూ.2వేలకు పెంచామని సీఎం కేసీఆర్ అన్నారు. 39.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని గుర్తుచేశారు. సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా రాష్ట్ర గీతాన్ని నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్‌ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో మా పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని వివరించారు. పెట్రోల్‌ ధరలను అదుపు చేయడం మా చేతుల్లో లేదని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement