Friday, November 22, 2024

ఇక కెసిఆర్ ‘సాగ‌ర’ మ‌థ‌నం..

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం..

కేసీఆర్‌ పద్మవ్యూహంలో నియోజకవర్గం
క్షేత్రస్థాయిలో వెూహరించిన గులాబీనేతలు
ముందస్తు ప్లానింగ్‌తో దూకుడు
షెడ్యూల్‌ వెలువడిన రోజే అభ్యర్థి ప్రకటన
మండలాలవారీగా నివేదికలు అందించిన దూతలు
హైదరాబాద్‌, : సాగరమథనంలో రాజకీయపార్టీలు తలమునక లయ్యాయి. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. ప్రధాన పార్టీలు ఛలో..సాగర్‌ అంటూ ఫోకస్‌ షిఫ్ట్‌ చేశాయి. పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాలు రాగానే.. సాగర్‌ రాజకీయం దుమ్మురేగబోతోంది. గెలిచిన పార్టీ మరింత దూకుడుగా దూసుకుపోనుంది. ఇందుకు సంబంధించిన అస్త్ర శస్త్రాలు, ప్రచార వ్యూహాలు, ఎన్నికల నినాదాలు.. అన్నీ సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాగార్జునసాగర్‌పై దృష్టి అటు అభివృద్ది వ్యూహాన్ని, ఇటు రాజకీయ సమీకరణాలను మార్చే ప్రణాళి కను అమలుచేస్తున్నారు. గత 20రోజులుగా.. క్షేత్రస్థాయిలో మకాం వేసిన పలువురు ఎమ్మెల్యేలు.. అటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తూనే, సాగర.. సమీకరణాలను గులాబీకి అనుకూలంగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయపార్టీలన్నీ.. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిన వేళ సీఎం ఓవైపు ఆ ఎన్నికలపై దృష్టిపెడుతూనే.. చాపకిందనీరులా సాగర వ్యూహాలు అమలుచేశారు. సీనియర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో ఈ ఉప ఎన్నిక జరగనుండగా, అదే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలని సీఎం భావిస్తున్నట్లు నేతలు ప్రచారం చేస్తున్నారు. అభ్యర్ధిత్వ అంశంపై.. సీఎం పలుమార్లు సర్వేలు నిర్వహించి అంచనాకు రాగా, క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను పూర్తి అనుకూలంగా మలుచుకునేందుకు పలు వ్యూహాలు అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వవిప్‌ బాల్కసుమన్‌ను పెద్దవూర మండలానికి ఇన్‌ఛార్జిగా పంపగా, ఇతర మండలాలకు సామాజిక సమీకరణల వ్యూహంతో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌, కరీంనగర్‌ మేయర్‌ సునిల్‌ రావు తదితరులను ఇన్‌ఛార్జిలుగా పంపగా.. దాదాపు ఇరవైరోజులు పక్కాగా గ్రౌండ్‌ వర్క్‌ చేశారు. అధినేత కేసీఆర్‌కు నివేదిక కూడా అందజేశారు.
గెలుపు మంత్రం
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలపై గెలుపుధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌.. నాగార్జునసాగర్‌లో నయా రాజకీయానికి రెడీ అయింది. సాగర్‌లో 2.08లక్షల మంది ఓటర్లుండగా, 2018 ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 85.98శాతం పోలింగ్‌ జరిగింది. వాస్తవానికి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్‌ రావాల్సి ఉన్నా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీచేస్తామని చెప్పి జాప్యం చేస్తోంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఏప్రిల్‌ 29న బెంగాల్‌ ఆఖరి విడత ఎన్నిక జరగనుండగా, అదేరోజు ఇక్కడ కూడా పోలింగ్‌ జరగవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి జానారెడ్డి గత మూడు మాసాలుగా.. నియోజకవర్గం లోనే మకాంవేసి పాత సంబంధాలన్నీ పునరుద్దరిం చుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకుసాగుతుండగా, కాంగ్రెస్‌ పార్టీ నుండి ఇతర నియోజకవర్గాల వారు ఎవరూ ఇన్‌ఛార్జిలుగా వద్దని అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. లోకల్‌ వ్యూహంతో.. కాంగ్రెస్‌ గెలుపుమంత్రాన్ని రచిస్తోంది. ఇక బీజేపీ రకరకాల సామాజిక సమీకరణాలను పరిశీలిస్తోంది. గిరిజనుల ఓట్లను ఆకట్టుకుం టేందుకు ఇటీవల హుజూర్‌నగర్‌లో.. కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లో పలుసా ర్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించింది. మూడుపార్టీలు సాగరమథనం చేస్తుండగా.. గత రెండుమాసాలుగా సాగిన పట్టభద్ర హీట్‌ సాగర్‌లో కొనసాగి మరింత సెగలు పుట్టించనుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసి ఫలితాలతో ఊపుమీదున్న బీజేపీ.. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆ ఊపు కంటిన్యూ చేయగలుగుతుందా అన్న దానిమీద సాగర్‌లో దూకుడు ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తే.. వెంటనే కార్పోరేషన్‌ ఎన్నికల నగారా మోగించే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. ఈనెలలోనే నోటిఫికేషన్‌ వచ్చినా ఆశ్చర్యంలేదంటున్నాయి. వేడిలోవేడిగా వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. అటు సాగర్‌, ఇటు కార్పోరేషన్‌ వార్‌తో ఏప్రిల్‌ మాసమంతా పొలిటికల్‌ హీట్‌ కొనసాగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement