న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపర్చిన హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఆయన, విభజన చట్టం ప్రకారం 2022 నాటికి ఈ రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసల రహదారిగా విస్తరించాలని, కానీ నిర్మాణ సంస్థ జీఎంఆర్ ఆర్బిట్రేషన్ ద్వారా విస్తరణ పనులు చేపట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇదే విషయాన్ని తాను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చానని, ఆయన వెంటనే ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
మరోవైపు రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దేశంలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఈ మాత్రమైనా ఉన్నారంటే అందుకు ఆ రాజ్యాంగమే కారణమని అన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసియార్ నాశనం చేశారని, ముందు దాని గురించి మాట్లాడాలని హితవు పలికారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..