Thursday, November 21, 2024

Hyderabad – ఆందోళనలపై స‌ర్కారు ఉక్కుపాదం .. అయిదుగురు గుమిగూడితే అరెస్టు

నగరంలో అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ!
బీఎన్ఎస్ 163 అమలుపై జ‌నాల్లో గుబులు
ఇంటెలిజెన్స్ నివేదిక‌ల‌తో సర్కారు యాక్ష‌న్‌
ఇటు నిరుద్యోగులు.. అటు మూసీ బాధితులు
మధ్యలో బెటాలియ‌న్‌ స్పెషల్ పోలీసుల ర‌గ‌డ‌
సెక్రెటేరియ‌ట్‌, అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నాలు
వ‌రుస నిర‌స‌న‌ల‌తో హోరెత్తుతున్న హైద‌రాబాద్‌
జనంలో పెల్లుబుకుతున్న‌ అసంతృప్తి సెగలు
అణచివేత ధోర‌ణికి దిగిన‌ రేవంత్ స‌ర్కారు
ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు నిషేధిస్తూ ఆదేశాలు
నెల రోజుల‌పాటు ఆంక్ష‌లు విధించిన సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. హైడ్రా ఏర్పాటుతో చెరువులు, ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కాపాడే స‌రికొత్త య‌జ్ఞానికి తెర‌లేసింది. స‌ర్కారు చ‌ర్య‌ల‌పై సామాన్యులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ, మూసీ ప్రక్షాళనతో మధ్యతరగతి కుటుంబాలు భ‌గ్గుమ‌న్నాయి. జీవో 29తో నిరుద్యోగుల్లో అసంతృప్తి జ్వాల రగిలింది. మ‌రోవైపు బెటాలియ‌న్ల‌లో ప‌నిచేస్తున్న కానిస్టేబుళ్ల‌ను కూలీలుగా మార్చిన తీరు ఆయా కుటుంబాల్లో ఆవేద‌న‌కు గురిచేసింది. వ‌న్ పోలీస్‌.. వ‌న్ స్టేట్ అనే నినాదంతో బెటాలియ‌న్ పోలీసుల కుటుంబాలు రోడ్డెక్కాయి..

- Advertisement -

ఇట్లా వ‌రుస‌గా జ‌రుగుతున్న‌ ఆందోళల‌తో ఉద్రిక్తతలు త‌లెత్తాయి. ప్రతిపక్షం ఆందోళ‌న‌కారుల‌కు బాస‌ట‌గా నిలిచంది. దీంతో విచ్చిన్నకర శక్తులు విధ్వంస ర‌చ‌న‌కు ప్లాన్ చేశాయ‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి సిక్రెట్ నివేదిక అంద‌జేశాయి. హైదరాబాద్లో చెలరేగే ఘర్షణలకు బారికేడ్ వేయక తప్పలేదు. పోలీసుల ఆందోళ‌న‌ల‌కు అణచివేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 311ను ప్ర‌యోగించ‌గా.. ఇప్పుడు సెక్ష‌న్ 163తో ఆంక్ష‌లు విధించి, అప్రకటిత కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఆందోళనలపై ఉక్కుపాదం మోపటమే ప్రధాన ధ్యేయంగా సర్కారు సరికొత్త వ్యూహంతో బీఎన్ఎస్ (భార‌త న్యాయ సంహిత‌) సెక్ష‌న్‌ 163 అమలుకు సిద్ధపడింది. ఇంత అకస్మాత్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయాలను తీసుకోవటానికి నేపథ్యం ఏమిటీ? భవిష్యత్తు ఫలితం ఏమిటీ? అనే అంశాల‌పై జనంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

పోలీసులే తిరగబడితే..

పరిపాలన వ్యవస్థలో.. పోలీసు వ్యవస్థ కీలకమైంది. సర్కారుకు నమ్మిన భుటుల్లాంటివారు పోలీసులే. మరి ఈ వ్యవస్థలో వేళ్లూనిన గులాంగిరీని వ్యతిరేకించటమే రాజద్రోహంగా పరిపాలన వ్యవస్థ భావించింది. వారిపై ఆర్టిక‌ల్ 311 ప్ర‌యోగించి పది మంది ఉద్యోగాలను ఊడగొట్టింది. 29 మందిని విధులకు దూరంగా పెట్టింది. ఇక్కడే పోలీసు వర్గాల్లో అసంతృప్తి రగిలింది. ఈ స్థితిలోనే రాష్ట్రమంతా ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాల‌ని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్‌ విధించారు. సెక్రటేరియట్‌ పార్కింగ్‌ గ్రౌండ్‌లో సుమారు 200 మంది సిబ్బందిని మోహరించారు.

ధ‌ర్నా చౌక్ వ‌ద్ద పోలీసుల భ‌ద్ర‌త‌..
ధ‌ర్నా చౌక్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద పోలీసు వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కాగా, వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు నగరంలో ఆందోళన నేపథ్యంలో పోలీసులు నెలరోజుల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి నవంబర్‌ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం విధించారు. అయిదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలులోకి వచ్చింది.

క‌ర్ఫ్యూల్లేవ్‌.. మ‌త ఘ‌ర్ష‌ణ‌ల్లేవ్‌..

హైదరాబాద్ పేరు చెబితే చాలు… ఏ క్షణంలో ఎక్కడ ఘర్షణ జరుగుతుందో? ఎప్పుడు పోలీసులు కర్ఫ్యూ ఖడ్గం ఝళిపిస్తారో? ఊహించటం కష్టం. కానీ, ఆ కాలం కరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత మత ఘర్షణలు లేవు. కత్తిపోట్లు లేవు. ఒక రకంగా రౌడీల దందాకు తెరపడింది. కర్ఫ్యూ ఊసు లేదు. పదేళ్లుగా దొమ్మీలు లేవు. ఉంటే.. అరకొర కిడ్నాపులు, హత్యలు.. ఎన్‌కౌంట‌ర్ల వంటి వాటిని పోలీసులు సమర్థంగానే ఎదుర్కొన్నారు.

కానీ, తెలంగాణలో కాంగ్రెస్ శకం మళ్లీ పునర్జీవనం పోసున్న ఈ 10 నెలల కాలంలోనే.. ప్రభుత్వంపై ప్రతిపక్షం విరుచుకుపడటానికి కారణాలు ఏంటీ? సీఎం రేవంత్ తన సరికొత్త వ్యూహాలతో సామాన్య జనం మదిని కొల్లగొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ శిబిరంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. తీసుకునే ప్రతినిర్ణయంపై జనంలో ఎక్కడ అసంతృప్తి జాడ కనిపించలేదు. కేవలం రెండు నెలల నుంచే సర్కారు పోకడపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బ్యూరోక్రాట్లకు రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సొంత పార్టీ ప్రాబల్యం కూడా పైకి కనిపించటం లేదు. సీఎం మాటే శిరోధార్యం అనే రీతిలో అనేక నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ప‌థ‌కాల అమ‌లులో సర్కారు తప్పులో కాలు వేసిన‌ట్టు జనంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

మూసీ మ‌సి, జీవో 29, కానిస్టేబుళ్ల గోస‌..

మూసీ నది ప్రక్షాళనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పేదల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ మధ్యతరగతిలోనే తీవ్ర అసంతృప్తి రాజుకుంది. అప్పులు చేసి క‌ట్టుకున్న ఇళ్లు కళ్లముందే కూలిపోతుంటే తట్టుకోలే కపోతున్నారు. వీరిని సముదాయించటంలో ప్రభుత్వం విఫలమైంద‌నే ఆరోపణ ఉంది. అందుకే ప్రతిపక్షాలకు ఓ ఆయుధం దొరికింది. జనాన్ని రెచ్చగొట్టే అవకాశం లభించింది. మూసీ సుందరీకరణకు ఓకే.. అంటూనే ఇళ్లను కూల్చొద్దు అంటూ వారి మ‌దిని ఆకట్టుకుంటోంది. ఈ మూసీ వ్యవహారమే ప్రభుత్వానికి వైరల్ పీవర్‌గా మారింది.

ఇక గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో రెండు రకాల జీవోలు మంటలు రగిల్చాయి. లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళనపై జనంలో సానుభూతి పెరిగింది. టీజీఎస్పీ కానిస్టేబుళ్ల గులాంగిరీపై తీవ్ర చర్చ జరిగింది. పోలీసు శాఖలో ఇంత బానిసత్వమా? అనే ప్రశ్నలు రేగాయి. ఆఖరికి ఇంటి ఇల్లాళ్లు, బిడ్డలు రోడ్డెక్కితే.. అసలు సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించలేదనే అపవాదును ప్రభుత్వం మూటగట్టుకుంది. ఆర్టికల్ 311 ప్రయోగించి రాజద్రోహం నిందతో 10 మంది ఉద్యోగాలను తొలగించటాన్ని జనం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సమస్యలన్నింటిలోనూ ప్రజల హక్కుల హననం చేస్తోందనే నింద ప్రభుత్వానికి తప్పటం లేదు.

అయిదుగురు గుమిగూడితే అరెస్టులే..

బీఎన్ఎస్ సెక్ష‌న్‌ 163 అమలు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్ర‌మాదం ఉంది.నిజానికి తెలంగాణ ప్రజలకు సెక్షన్ 30 అమలు తెలుసు. ర్యాలీలు, సభలను నియంత్రించటానికి పోలీసులు సెక్షన్ 30 అమలు చేసేవారు. కానీ, ఇప్పుడు భార‌త న్యాయ సంహిత‌లోని సెక్ష‌న్ 163ని ఎందుకు ప్ర‌యోగిస్తున్నారు అనే విష‌యంలో చాలామంది నుంచి వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ సెక్షన్ అమలులో అధికారం మొత్తం పోలీసులదే. కోర్టు జోక్యమూ అంతంతే. అక్రమ అరెస్టును ప్రశ్నించే అవకాశాలు చాలా తక్కువ. అందుకే.. తాజాగా ప్రభుత్వం అమలు చేస్తున్న బీఎన్ఎస్ 163తో తెలంగాణ రాజ‌ధానిలో అప్రకటిత కర్ఫ్యూ తెరమీదకు వచ్చిందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ సెక్ష‌న్ ద్వారా ఏడాది జైలు, ఫైన్ విధించే అవ‌కాశాలున్నాయి.. ఒక్కోసారి ఈ రెండూ అమ‌లు చేయొచ్చ‌ని 163 సెక్ష‌న్‌లో పొందుప‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement