Monday, November 25, 2024

Hyderabad – ఆగనంటున్న వాన – విద్యాసంస్థలకు నేడు సెలవు

హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆకాశానికి చెల్లు పడిందా అన్నట్లు భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచే భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి.

హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున కుండపోతగా మారింది.ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు.

విద్యానగర్ లోని పద్మా కాలనీ నీట మునిగింది. ఇండ్లల్లోకి నీరు చేరడంతో ఆ కాలనీ వాసులు పరిస్థితి దయనీయంగా ఉంది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. షేక్‌పేట, ఫిలింనగర్, గచ్చిబౌలి మార్గంలో సోమవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. మెహిదీపట్నం, టోలిచౌకి మార్గంలో వాహనాలు గంటలపాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

- Advertisement -

మంగళవారం తెల్లవారు జామునుంచి సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, సుచిత్ర, కోంపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అత్యవసరం అయితే బయటకు రావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షానికి నాలాలు ప్రమాదకరస్థితిలో పొంగిపోర్లుతుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ , నాగోల్, తార్నాక ఏరియాలో కుండపోత వర్షం కురుస్తోంది..

ఎడతెరిపి లేని వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు నేడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. సెలవుపై పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

భారీ వర్షంతో నగర వ్యాప్తంగా కాలనీలన్నీ జలమయమయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement