హైదరాబాద్ లో మూడు రోజుల పాటు నిర్వహణ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సర్వం సిద్ధం
50 దేశాల నుంచి పతంగ వీరులు రాక
వివిధ రూపాలలో కనువిందు చేయనున్న కైట్స్
దీనితో పాటుగా పిండి వంటల ఫెస్టివల్ ఏర్పాటు
హైదరాబాద్ – సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో ఈనెల 13 నుంచి మూడురోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.. రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పతంగుల ఫెస్టివల్ కు అంతర్జాతీయ, అంతర్రాష్టాల్లో పతంగులు ఎగురవేసే కైట్ ఫ్లయర్స్‌ను ఆహ్వానాలు ఇప్పటికే పంపారు.
ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, తదితర దేశాలకు చెందిన 50మంది కైట్ ఫ్లయర్స్ హాజరవుతున్నారు. వారితో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ , హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ర్టాలకుకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు.
ఉచితంగా ప్రవేశం
ఈ కైట్స్ ఫెస్టివల్ లోకి వీక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.. ఈ ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాటిని తిలకించే సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లను చేస్తున్నామని, పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉండనుంది.
నోరూరించే పిండి వంటలు, స్వీట్లు రెడీ
ఇక కైట్ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ల పండుగను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు ప్రజలు ఇళ్లలో తయారు చేసుకునే పిండి వంటలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్లను ఇందులో పరిచయం చేయనున్నామని, ఈ మేరకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఇరాన్, తుర్కియే, అప్ఘనిస్తాన్‌తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ప్రదర్శనలో పాల్గొననున్నట్లు తెలిపారు.