హైదరాబాద్ – ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే ఓడిపోతారని కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ తిన్న అవినీతి సొమ్ము అంతా కక్కిస్తామని అన్నారు. నాంపల్లి స్టేట్ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్, బీజేపీ ఒక్కటేనని అబద్ధపు ప్రచారాలు చెబుతున్నారని, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లీస్ తో కలవబోమని స్పష్టంచేశారు. వాళ్ళతో లాభపడింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.
కేవలం ఐదు నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. దీపావళి తర్వాత విస్తృత ప్రచారం చేస్తామని, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, యోగి, రాజ్‌నాథ్ సింగ్, హిమాంత బిశ్వశర్మ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం షిండే, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేస్తారని స్పష్టంచేశారు. మోడీ ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు. దీపావళి పండుగ తరువాత తమ పార్టీ తెలంగాణ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేయనుందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.