Thursday, October 24, 2024

Hyderabad – చెట్ల ర‌క్ష‌ణ‌పై హైడ్రా ఫోకస్ …

శాస్త్రీయ విధానాలు అమ‌లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్
రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల‌ను తొల‌గించే ప్లాన్‌
కొమ్మ‌ల క‌టింగ్‌తో బ్యాలెన్సింగ్ కోల్పోకుండా చ‌ర్య‌లు
జీహెచ్ ఎంసీ, అట‌వీశాఖ అధికారుల‌తో హైడ్రా చీఫ్ భేటీ
వ‌ర్షాలు, గాలి వాన‌కు చెట్లు ప‌డిపోకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు
ట్రాన్స్ లొకేష‌న్ చేసి కాపాడేందుకు య‌త్నాలు
ఆయా విభాగాల అధికారులు, సిబ్బందికి క‌చ్చిత‌మైన ఆదేశాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: హైదరాబాద్ సిటీ సమస్యలపై ఫోకస్ పెట్టిన‌ హైడ్రా.. త‌ను ప్రాధాన్యాంశాల‌ లిస్టును రెడీ చేసుకుంది. మొదటగా ట్రాఫిక్‌, డ్రైనేజీ వ్యవస్థపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. దీనిపై దృష్టి సారించిన హైడ్రా అధికారులు ఇతర విభాగాలను సమన్వయం చేసుకుని అడుగులు వేస్తున్నారు. ట్రాఫిక్‌ జామ్​కు గల కారణాలను తెలుసుకుని జీహెచ్‌ఎంసీతో కలిసి సెట్ చేసే ప‌నిలోప‌డ్డారు.

ప్ర‌మాద‌క‌రంగా ఉన్న చెట్ల తొల‌గింపు..

- Advertisement -

ఇక.. తాజాగా హైదరాబాద్‌లోని చెట్ల పరిరక్షణతోపాటు ప్రధాన రహదారులు, కాలనీల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్‌ రంగానాథ్ నిర్ణయించారు. దీనికి జీహెచ్‌ఎంసీ, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైడ్రా కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించ నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, అటవీశాఖ అధికారులతో జోన్ల వారీగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో చెట్ల పరిస్థితిపై సర్వే చేయాలని సూచించారు. ఎండిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను వెంటనే తొలగించాలని, ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. అలాగే వాల్టా చట్టం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శాస్త్రీయ విధానంలో చెట్ల పరిరక్షణ

ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని, ఇంకా ఇబ్బందిగా ఉంటే ఆ చెట్లను ట్రాన్స్ లొకేట్ చేయాలని హైడ్రా చీఫ్ భావిస్తున్నారు. విద్యుత్ తీగలు తగులుతున్నాయని, అశాస్త్రీయంగా చెట్ల కొమ్మలను నరకడం చేయవద్దని అధికారులకు రంగనాథ్ ఆదేశించారు. వాహనాలకు కొమ్మలు తగులుతున్నాయని చెట్లకు ఒకవైపే నరకడం వల్ల చెట్టు బ్యాలెన్స్ కోల్పోయి చిన్నగాలి వానకే కూలిపోతున్నాయన్నారు. ఈ విషయంలో శాస్త్రీయ విధానాలను అనుసరించి చెట్ల పరిరక్షణ కోసం పాటుపడాలని రంగనాథ్ అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement