Tuesday, November 26, 2024

Drunk and Drive : తాగారు.. తూలారు… తోలారు…3300 మంది చిక్కారు…

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోగా, మరోవైపు యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్‌ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందుబాబుల పనిపట్టారు. హైదరాబాద్‌, సైబరాబా కమిషనరేట్లలో కలిసి 3300కుపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1500లకుపైగా కేసులు నమోదవగా, సైబరాబాద్‌లో 1241 కేసులు ఉన్నాయి. ఇక రాచకొండలో 517 మందిపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో 3500కుపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి.

సైబ‌రాబాద్ లో …

సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్‌ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌ను ఆదివారం రాత్రి 8 గంటలకే మూసివేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై విమానం టికెట్‌ ఉన్నవారికి మాత్రమే అనుమతించారు.

రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ పరిధిలో ..

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపి మొత్తం 517 మంది దొరికారు. ఇందులో అధికంగా 21-30 సంవత్సరాల వయస్సు గలవారే 223 మంది ఉన్నారు. 9 ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో 517 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. అత్యధికంగా ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 107 కేసులు బుక్ కాగా అత్యల్పంగా యాదాద్రి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో 20 కేసులు నమోదయ్యాయి. 254 మంది మందు బాబులకు బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) 50- 150 వచ్చింది. అత్యధికంగా బీఏసీ కౌంట్348 పాయింట్లు రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో నమోదయింది

Advertisement

తాజా వార్తలు

Advertisement