హైదరాబాద్, ఆంధ్రప్రభ: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని పిలిచి మహిళపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మణికొండలో హౌస్ కీపింగ్ పని చేసే ఒక వివాహిత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. సినిమాల్లో నటిస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చని భావించింది. 15 రోజుల క్రితం అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో చేరి, జూనియర్ ఆర్టిస్టుగా అవకాశం కోసం కృష్ణానగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో తిరుగుతోంది. ఈ క్రమంలో ఆమెకు టాలీవుడ్ డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్న కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది.
హోటల్ గదిలో..
మూడు రోజుల క్రితం ఆడిషన్స్ జరుగుతున్నాయని కృష్ణానగర్‌లోని హెవెన్ హోటల్‌కు కాటేకొండ రాజు ఆమెను పిలిచాడు. తొలిరోజు ఫొటో షూట్ చేశాడు. మరుసటి రోజు కూడా రావాలని చెప్పాడు. రెండో రోజు హోటల్ గదికి వెళ్లగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది, బీఎన్ఎస్ 64, 79, 115, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.