Wednesday, November 20, 2024

Hyderabad – ముత్యాల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హం ధ్వంసం – మోండా మార్కెట్ లో టెన్ష‌న్

మోండా మార్కెట్ లో టెన్ష‌న్
హిందూ సంఘాలు ధ‌ర్నా
ఎమ్మెల్యే గ‌ణేష్ కు నిర‌స‌న సెగ‌
సంఘట‌నా స్థలానికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి,
మాజీ మంత్రి త‌ల‌సాని
చ‌ర్య‌ల‌ను ఖండించిన నేత‌లు
దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్

హైదరాబాద్‌: సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గీ రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు.

ఇక‌ విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు నేటి ఉద‌యం ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. గుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగారు. దీంతో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను గో బ్యాక్ అంటూ నిరసన సెగ తగిలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర కిషన్‌ రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.

దోషుల‌ను క‌ఠినంగా శిక్షించండి – త‌ల‌సాని

అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలను ప్రేరిపించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. నిన్నటివరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామత నవరాత్రులు, బతుకమ్మ వేడుకులు జరుపుకున్నారని చెప్పారు. విగ్రహం ధ్యంసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు.

- Advertisement -

మ‌తోన్మాదంతోనే విగ్ర‌హం ధ్వంసం – కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

మతోన్మాదంతోనే ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను ఆయ‌న ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. డీజేలపై నిషేధం విధించిన పోలీసులు.. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గమ్మ నవరాత్రుల పూజ సందర్భంగా చాలా రకాల ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ‌రుస‌గా ఆల‌యాలపై దాడులు

నాంపల్లి ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరిగిందని మండిపడ్డారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ దుర్గామాత ఆలయంలో దొంగతనానికి రాలేదని, దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే వచ్చి ఉంటారని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో వచ్చి సికింద్రాబాద్ ముత్యాలమ్మ వారి విగ్రహాన్ని తొలగించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల వద్ద రాత్రి సమయంలో పోలీస్ పర్యవేక్షణ ఉండాలని కిషన్ రెడ్డి కోరారు.

మ‌నోభావాలు దెబ్బ‌తీస్తే ఉపేక్షించేది లేదు – ఎంపి ఈట‌ల

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈటల తెలిపారు. కాగా, సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ పరిధిలో ముత్యాలమ్మ గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement