Saturday, June 29, 2024

Hyderabad – మియాపూర్‌, చందానగర్‌ లలో టెన్షన్ – 29 వరకు 144 సెక్షన్ విధింపు

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌, చందానగర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ఇది అమలులో ఉండనుంది. ఈ మేరకు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

మియాపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు. మియాపూర్‌లో వివాదాస్పదంగా మారిన భూములను అవినాష్ మహంతి పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు.

శనివారం రాజధాని శివారులోని సర్కారు భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌ సమీపంలోని సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2 వేల మంది యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం 144 సెక్షన్‌ విధించారు.

ఆక్రమణదారుల కన్ను

దేశ విభజన సందర్భంగా ఇక్కడి నుంచి పాకిస్థాన్‌కు తరలిపోయిన వ్యక్తులకు చెందిన (అవెక్యూ) భూముల కింద ఈ 525 ఎకరాలను పరిగణిస్తూ గతంలో ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ భూములను తాము గతంలో కొనుగోలు చేశామని 32 మంది కోర్టు కెళ్లారు. కింది కోర్టుల నుంచి హైకోర్టు వరకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ భూమి గజం లక్ష వరకు పలుకుతుండటంతో చాలామంది రాజకీయ నేతలు, ఆక్రమణదారుల కళ్లు వీటిపై పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లెక్క చేయడం లేదు. ఇప్పటికే ఇందులో 50 ఎకరాల వరకు ఇప్పటికే అన్యాక్రాంతమైంది.

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement