ట్యాంక్ బండ్ పై అధికారికంగా వేడుకలు
బతుకమ్మలతో రానున్న 10 వేల మంది మహిళలు
ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్,అమరవీరుల స్థూపం వద్ద భారీ ఏర్పాట్లు
బతుకమ్మల నిమజ్జనంలకు ప్రత్యేక ఘాట్లు ..
నేటి సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ..
హైదరాబాద్ – ట్యాంక్ బండ్‌పై నేడు జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ట్యాంక్బండ్అమరవీరుల స్తూపం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న రోటరీ చిల్డ్రన్స్ పార్కు వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకలో స్వయం సహాయక బృందాలకు చెందిన 10 వేల మంది మహిళలు బతుకమ్మలతో తరలిరానున్నారు. బతుకమ్మ పాటలకు పాదం కలపనున్నారు.
ఈ సందర్భంగా పలు శాస్త్రీయ, జానపద సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం రోటరీ పార్కులో ఏర్పాటు చేసిన పాండ్స్ లో ఆడబిడ్డలు బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రోటరీ పార్కులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా 56 మినీ కొలనులను ఏర్పాటు చేశారు. పాండ్స్వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా బారికేడ్లను ఉంచారు.
దారి పొడవునా ఎల్ఈడీ స్క్రీన్స్, లైట్లు, భారీ బతుకమ్మ ప్రతిమలతో అలంకరించారు. ముందస్తు జాగ్రత్తగా పాండ్స్ వద్ద గజ ఈతగాళ్లు, డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నారు. అనుకోని సంఘటనలు జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రాథమిక చికిత్స అందించడానికి ట్యాంక్‌బండ్ పై 3 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అత్యవసర చికిత్స అవసరం పడితే.. తరలించడానికి 5 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుతున్నామని హైదరాబాద్జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
హై సెక్యూరిటీ..
సద్దుల బతుకమ్మ వేడుకలకు సీఎం, మినిస్టర్లు హాజరవుతున్న నేపథ్యంలో 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1000 మంది సివిల్, 500 మంది ట్రాఫిక్ పోలీసులు నిరంతరం భద్రతను పర్యవేక్షించనున్నారు. ట్యాంక్‌బండ్ పై వందకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గణేశ్ నిమజ్జన సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకుని బతుకమ్మ ఉత్సవాల్లో షీటీమ్స్‌తో మరింత నిఘా పెంచారు. 10 షీటీమ్స్, 100 మంది పోలీసులతోపాటు ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో స్పై కెమెరాలు, హై డెఫినేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహిళలను వేధిస్తూ నిఘా కెమెరాలకు చిక్కిన ఆకతాయిలను అక్కడే అరెస్ట్ చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. అందుకోసం మహిళా పోలీసులు, మఫ్టీ పోలీసులతో బతుకమ్మ ఉత్సవాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు
అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పోలీస్ కంట్రోల్ రూమ్, శాసనసభ, అప్పర్ ట్యాంక్ బండ్ దగ్గర వాహనాల రాకపోకలను నిషేధించారు.. ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లించారు. వివి విగ్రహం , ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్ ఐమాక్స్ , మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లించారు.