By Poll: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ముగిసిన నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపులో.. అన్ని రౌండ్లలోనూ ఈటల పైచేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వెనుకంజలో ఉన్నారు. అటు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ కనీస పోటీ కూడా ఇవ్వలేక ఢీలాపడ్డారు.
హుజూరాబాద్ బైపోల్ ఓట్ల లెక్కింపు సరళిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా.. వ్యక్తుల గెలుపే తప్ప పార్టీల గెలుపు కాదని ఆయన అన్నారు. హుజూరాబాద్‌లో ఎన్నికలు ఎలా జరిగిందన్న విషయం అందరికీ తెలుసన్నారు.
డబ్బు ప్రభావం ఎక్కువగా ఉన్నందున హుజూరాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే కోరిందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని చెప్పుకొచ్చారు.