Friday, November 22, 2024

Huzurabad – పేద‌ల త‌ర‌పున మాట్లాడితే ఈట‌ల‌ను గెంటేశారు – కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం హుజురాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఓ కుటుంబం నుంచి సీఎం అవుతారని అన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతారని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని అమిత్ షా కోరారు. పేదల తరుపున మాట్లాడినందుకే సీఎం కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకున్నారని విమ‌ర్శించారు. అందుకే పార్టీ నుంచి బయటకు పంపించారని అన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య ఒప్పందం..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని అమిత్ షా ఆరోపించారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్‌నే సీఎం చేయాలని కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ రాహుల్ గాంధీ చూస్తున్నారని అన్నారు. అలాగే రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమ‌ర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు తీసి వేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం రూ.60 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. వరి ధాన్యానికి రూ.3100 మద్దతు ధర ఇస్తామని చెప్పారు. మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement