Friday, November 22, 2024

జోరుగా ‘సాగర్‌’ ప్రక్షాళన

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏడేళ్లలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అభివృద్ధి పనులతో పాటు సుందరీకరణ పనులు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఇటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) అటు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎం డీఏ) రాజధాని నగరంలోని మౌలిక సదుపాయాలను నిరంతరాయంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరానికి వారసత్వ సంపదగా, పర్యాటక ఆకర్షణగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను బయోలాజికల్‌ రెమెడియేషన్‌ పద్ధతిలో ప్రక్షాళన చేయడానికి హెచ్‌ ఎండీఏ నడుం బిగించింది. ఇందు కోసం హెచ్‌ఎండీఏ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కంపెనీల నుంచి ప్రతిపాదనలను(ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానించింది. హుస్సేన్‌ సాగర్‌ను వీక్షించడానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి మురుగు వాసన రాకుండా బ్యాక్టీరియాలనువాడి శుభ్రపరచడం, సాగర్‌లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఆల్గే మొక్కలను నశింపచేయడం ప్రధాన పనులుగా టెండర్లలో పేర్కొంది. ఈ పనులను మూడేళ్ల నుంచి చేపడుతున్నామని, ఈ ఏడాది కూడా పనులు కొనసాగిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ వెల్లడించింది.

జైకా నిధులతో ఇప్పటికే పెద్ద ఎత్తున సాగర్‌ ప్రక్షాళన..
హుస్సేన్‌ సాగర్‌ లేక్‌ అండ్‌ క్యాచ్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు(హెచ్‌సీఐపీ) పేరుతో హెచ్‌ఎండీఏ హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమాలకు జపాన్‌ బ్యాంకు జైకా ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ టెండర్‌లో పేర్కొంది. హెచ్‌ఐసీపీలో భాగంగా ఇప్పటికే హుస్సేన్‌ సాగర్‌లోకి వచ్చే మురుగు నీటిని చాలా వరకు మళ్లించినట్లు తెలిపింది. ఇంతేగాక సివరేజి ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లు నెలకొల్పి సాగర్‌లోకి వచ్చే మురుగునీటిని చాలా వరకు శుద్ధి చేసి వదులుతున్నట్లు పేర్కొంది. ఈ చర్యలన్నింటితో గతంతో పోలిస్తే సాగర్‌ పరిస్థితి ప్రస్తుతం మెరుగైనట్లు తెలిపింది. ఈ చర్యలతో పాటు గడిచిన మూడు సంవత్సరాల నుంచి చేపడుతున్న బయోలాజికల్‌ రెమెడియేషన్‌ ప్రక్రియతో సాగర్‌ నుంచి వచ్చే దుర్వాసన చాలా వరకు తగ్గడంతో పాటు దానిలో పెరిగే ఆల్గే జాతికి చెందిన మొక్కలను అరికట్టగలిగామని, ప్రస్తుతం సాగర్‌లో డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌(డీవో) స్థాయి ఇంచుకు నాలుగు మిల్లి గ్రాములుగా ఉందని వెల్లడించింది. బయోలాజికల్‌ రెమెడియేషన్‌ ప్రక్రియను నిరంతరం చేపట్టాలని నిశ్చయించినం దున ఆ పనుల కోసం కాంట్రాక్టు ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నట్లుగా టెండరులో హెచ్‌ఎండీఏ వెల్లడించింది.

సాగర్‌ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
హుస్సేన్‌సాగర్‌ను పర్యావరణహితంగా తీర్చిదిద్దడానికే బయోలాజికల్‌ రెమెడియేషన్‌ పద్ధతిలో శుభ్రపరిచేందుకు నిర్ణయించినట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. సాగర్‌ నీటిని సాధారణ నీటి సమతుల్యత స్థాయికి తీసుకువచ్చే క్రమంలో బ్యాక్టీరి యాలతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంది. టెండరు వేసే కంపెనీ టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుందని తెలిపింది. సాంకేతికతను ప్రయోగా త్మకంగా ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొంది. టెండరు వేసే కంపెనీ ఏడాదికి కనీసం రూ.5 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉండాలని పేర్కొంది. ఈ టెండర్లకు సంబంధించి బుధవారం ఏజెన్సీ లతో ప్రీ బిడ్‌ సమావేశాన్ని నిర్వహించనుంది. టెండర్లు సమర్పించడానికి తుది గడువు ఈ నెల 28అని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement