Tuesday, November 26, 2024

వంద మంది పీకేలు వచ్చినా టీఆర్‌ఎస్‌ను కాపాడలేరు.. రాష్ట్రాన్ని బిహార్‌ బ్యాచ్‌ ఏలుతోంది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ‘‘టీఆర్‌ఎస్‌ పై రోజు రోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. నిన్న మొన్నటి నుంచి రాష్ట్రంలో పీకే, ప్రకాశ్‌రాజ్‌  తిరుగుతున్నరు. వంద మంది పీకేలు, ప్రకాశ్‌రాజ్‌లు వచ్చినా ఏం చేయలేరు. నదులకు నడక నేర్పింది, ఉచిత విద్యుత్‌, కేజీటూ పీజీ సీఎం కేసీఆరేనని టీఆర్‌ఎస్‌ బ్యాచ్‌ చెబుతోంది. మరి బీహర్‌ నుంచి ప్రశాంత్‌ కిషోర్‌ను ఎందుకు తెచ్చుకున్నారు’’ అని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు, జిమ్మిక్కులు చేసినా 12 నెలల్లో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని, పథకాలన్ని మన కార్యకర్తలకే వస్తాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ డిజిటల్‌ మెంబర్షిప్‌ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘ బీహర్‌ బ్యాచ్‌ రాష్ట్రాన్ని ఏలుతోంది. ఐఏఎస్‌ అధికారులైన సోమేష్‌కుమార్‌, అరవింద్‌కుమార్‌, సందీప్‌ సుల్తానీయా, రజత్‌కుమార్‌, ఐపీఎస్‌ అంజనీకుమార్‌ బీహర్‌ వాళ్లే. వీళ్లలో ఒక్కొక్కరికి ఐదారు శాఖలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ పూర్వకులు కూడా బీహర్‌ వాళ్లే. మరోసారి గెలవడానికి బీహార్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను తెచ్చుకున్నారు. బీహార్‌ లో ఎన్నికలు జరిగితే తుపాకులు, బాంబులు పట్టుకుని తిరుగుతరు ‘ అని ఆయన ఆరోపించారు.


తెలంగాణ ప్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదని, పాలమూడు బిడ్డ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కేసీఆర్‌ పాలన నచ్చక రాజీనామా చేసి బయటికి వచ్చిండన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రాజీనామా చేసి బయటికి రావాలని డిమాండ్‌ చేశారు. ఐఏఎస్‌ మురళి ధైర్యంగా రాజీనామా చేసి బయటికి వచ్చారని రేవంత్​రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర బ్రాహ్మణులను తిట్టిన కేసీఆర్‌ ఇప్పుడు వాళ్లనే ప్రోత్సహిస్తూ తెలంగాణ వారిని పట్టించుకోవడం లేదని, చిన జీయర్‌ ఏ ప్రాంతానికి చెందిన వారో చెప్పాలన్నారు. నీళ్లు జగన్‌కు, నిధులు ఒక బడా కంపెనీకి, ఉద్యోగాలు కేసీఆర్‌ ఇంటికి వెళ్లాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం 80 లక్షలకు చేరితే 90 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.

38 లక్షల సభ్యత్వాలు పూర్తి..
సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంట్‌ నియోజక వర్గం 4.30 లక్షలతో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా.. 47 వేల సభ్యత్వాలతో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ చివరి స్థానంలో ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల సభ్యత్వాలు పూర్తయినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో 100 సభ్యత్వాలు చేయకుంటే వారి పదవులు రద్దు చేయాలని, పార్టీ కోసం కష్టపడిన పని చేసే వారికి ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి బోసు రాజు, టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ గీతారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్‌ శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement