తల్లీబిడ్డలను కాపాడిన ఆర్టీసీ సిబ్బందిపై రేవంత్ సజ్జనార్ ప్రశంసలు
కరీంనగర్ బస్టాండ్‌లో అకస్మాత్తుగా మహిళకు పురిటినొప్పులు
చీరలు అడ్డుకట్టి ప్రసవం చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది
108 అంబులెన్స్ రాగానే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ బస్‌స్టాండ్‌లో అకస్మాత్తుగా నొప్పులు ప్రారంభమైన గర్భవతికి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్‌వైజర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్ చేస్తూ, కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఇక ఆర్టీసీ ఎండి సజ్జనార్ తన ట్విట్ లో మానవత్వం పరిమళించిందంటూ అభినందనలు తెలియజేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తల్లీబిడ్డల ప్రాణాలు నిలిచాయన్నారు. ప్రజలకు రవాణా సేవలు అందించడంతో పాటు మానవత్వం చాటుకోవడంలోనూ తామేమీ తక్కువ కాదని ఆర్టీసీ సిబ్బంది నిరూపించారని అన్నారు.
వివరాలిలా…. ఊరెళ్దామని కరీంనగర్ బస్ స్టేషన్‌కు వచ్చిన ఓ గర్భిణికి అక్కడే నొప్పులు మొదలవడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వచ్చే లోపు సాధారణ ప్రసవం చేసి తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన వలస కూలీ కుమారి ఆమె భర్తతో కలిసి పెద్దపల్లి జిల్లా కాట్నల్లి ఇటుక బట్టీలో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం కుంట వెళ్దామని కరీంనగర్ బస్టాండ్‌లో భద్రాచలం బస్సు ఎక్కేందుకు వచ్చారు. కుమారి నిండు గర్భిణి కాగా, ఆమెకు బస్టాండ్‌లోనే నొప్పులు మొదలయ్యాయి. వెంటనే భర్త ఆమెను పక్కన పడుకోబెట్టి సాయం కోసం ఆర్టీసీ అధికారులను వేడుకున్నాడు.
దీంతో వారు 108కు సమాచారమిచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్‌వైజర్లు ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి సాధారణ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగానే తల్లీబిడ్డలను కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. గర్భవతికి అండగా నిలిచిన సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.