పోలింగ్ కోసం ప్రత్యేక బస్సులు
ఎపికి అదనంగా వెయ్యి బస్సులు
తెలంగాణలో 1500 బస్సుల రన్నింగ్
13న 54 లక్షల మంది ప్రయాణం
ఏకంగా 24.22 కోట్ల ఆదాయం
14న అంతే సంఖ్యలో ప్రయాణీకుల తిరుగుటపా
ఈసారి రూ.15 కోట్ల ఆదాయం
మహాలక్ష్మీ పథకం ద్వారా రూ 9 కోట్లు
లోక్‌సభ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో 2,500 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడిపించింది. తెలంగాణలో సుమారు 1,500 బస్సులు, ఆంధ్రపదేశ్‌కు దాదాపు వెయ్యికి పైగా బస్సులను తిప్పింది. జేబీఎస్, ఎంబీబీఎస్ వంటి ప్రధాన బస్టాండ్లతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించింది. దీంతో రవాణా సంస్థకు 23 గంటల్లోనే పెద్దఎత్తున ఆదాయం సమకూరింది.
పోలింగ్ రోజైన ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సంస్థకి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక ఎన్నికల తెల్లారి 54 లక్షల మంది ప్రయాణించారు. టికెట్ కొనుగోలు చేసిన వారి ద్వారా ఆదాయం రూ.15 కోట్లు సమకూరాయని అధికారులు తెలిపారు. ఇందులో మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.