హైదరాబాద్ – శవపేటికల మీద చిల్లర ఏరుకునే విధంగా మోడీ విధానాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి సహాయ నారాయణ. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కామన్ సివిల్ కోడ్ ను తెర పైకి తెస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో అనేక మతాల వారు ఉన్నారని తెలిపారు. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. కామన్ సివిల్ కోడ్ తో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోడీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు. మణిపూర్ అటవీ సంపదని దోచుకునేందుకు మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులతో తాము కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. తమిళసై తెలంగాణ గవర్నర్ గా ఉంటూ.. పాండిచ్చేరి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న తమిళి సై అక్కడ 250 డిస్కో పబ్బులకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఇక వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ వస్తోంది కానీ, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన మనీశ్ సిసొడియాకు మాత్రం బెయిల్ రాదన్నారు.