హైదరాబాద్, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్ పార్టీలోని అసంతృప్తులు, అలకలను క్యాచ్ చేసుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. బీఆర్‌ఎస్ టికెట్ రాని వారిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్లు కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ప్రజా బలం ఉన్నా నాయకులకు హస్తం గూటికి చేర్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు నాయకులను పీసీసీ స్థాయిలో మంతనాలు సాగుతుండగా, ఒకరిద్దరి నాయకుల విషయంలో పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ కోసం దరకాస్తు కూడా చేసుకున్నది. ఆమె భర్తి శ్యామ్‌నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కాకుండా ఆసిఫాబాద్ నియోజక వర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నకిరెకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో.. బుధవారం ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరి నకిరెకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్‌పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మైనంపల్లిపై వేటు వేసేందుకు బీఆర్‌ఎస్ రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మైనంపల్లి హనుమంత రావు గూడా బీఆర్‌ఎస్ వేటు వేస్తే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మైనంపల్లి విష యంలో పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగినట్లుగా సమా చారం.
మల్కాజ్‌గిరితో పాటు ఆయన తనయుడి కోసం మెదక్ అసెంబ్లి సీట్లు ఇవ్వాలని మైనంపల్లి కోరుతున్నట్లుగా తెలిసింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మెదక్ అసెంబ్లి తో పాటు మల్కాజ్‌గిరి పార్లమెం ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చినట్లుగా సమాచారం. మల్కాజ్‌గిరిలో డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ గత కొన్నేళ్లుగా పని చేసుకుంటున్నారని, బీసీ వర్గానికి చెందిన శ్రీధర్‌కు అన్యాయం చేయడం సరికాదనే బావనతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. మైనంపల్లి మాత్రం రెండు అసెంబ్లి సీట్లు కావాలని అడుగుతున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటోందనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు విషయం లోనూ కాంగ్రెస్ నుంచి రాయబారాలు సాగుతున్నాయని తెలిసింది. ఒక వేళ తుమ్మల కాంగ్రెస్‌లోకి వస్తే సీట్ల సర్దు బాటులో ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. పాలేరు సీటును తుమ్మల అడుగుతున్నారని, అదే సీటుపై వైఎస్సా ర్‌టీపీ అధ్యక్షురాలు షర్మీల కూడా పట్టుపడుతున్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని షర్మిల దాదాపు నిర్ణయం తీసుకోవడం, ఢిల్లి లో చర్చలు కూడా పూర్తయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు
కూడా బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉన్న ట్లుగా తెలిసింది. వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడా సీటు ఇచ్చినా పోటీ చేసేం దుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే బీఆర్‌ఎస్‌లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే తన అనుచ రులతో మంతనాలు చేస్తున్నారు. దళిత బంధు పథకం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం కేసీఆరే స్వయంగా ఆహ్వానించి పార్టీలోకి రావాలని కోరారని, పార్టీలో చేరి రెండేళ్లు అవుతున్నా ఇప్పటీ వరకు ఏ పదవీ ఇవ్వలేదని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. గురువారం మోత్కుపల్లి అనుచరులు యాదగిరిట్టలో సమావేశమై.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు అప్పీల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే మోత్కుపల్లి అనుచరులు చేసే అప్పీల్‌కు కేసీఆర్ అంగీకరిస్తారా..? లేదా అనేది ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు.