Monday, November 25, 2024

TG | హిందూ, ముస్లింలు తెలంగాణ స‌ర్కార్ కు రెండు కళ్లలాంటి వారు : రేవంత్

హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఉన్నవి రెండే పరివార్లు అని.. ఒకటి మోదీ పరివార్ అయితే.. మరొకటి గాంధీ పరివార్ అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మోదీ పరివార్ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు పనిచేస్తోందని దుయ్యబట్టిన రేవంత్.. గాంధీ పరివార్ దేశ సమైక్యతకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనార్టీలు కృషి చేశారని కొనియాడారు. ముస్లింలను తాము కేవలం ఓటర్లుగానే చూడటం లేదని, సోదరులు, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని తెలిపారు. అందరూ అండగా ఉంటే.. విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందామని తెలిపారు.

నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ ప్రజలకు మెరుగైన విద్యను అందించేందుకు ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని తెలిపారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయినందునే ఒక్క మైనార్టీ నేతకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం వివరించారు. కానీ.. షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారులుగా, అమీర్ అలీఖాన్ కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంతో పాటు కార్పొరేషన్లలోనూ అవకాశాలిచ్చామన్నారు. వైఎస్సార్ తర్వాత గడిచిన పదేళ్ల కాలంలో ఇప్పటి వరకూ సీఎంఓలో మైనారిటీ అధికారిని నియమించలేదని గుర్తుచేశారు సీఎం రేవంత్ రెడ్డి.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ దేశంలో మైనార్టీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా అవకాశం కల్పించిందని తెలిపారు. మైనార్టీలో మోదీ పరివార్ తో ఉండాలో, గాంధీ పరివార్ తో నడవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అగాదీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనార్టీలు కృషి చేయాలని, మోదీని ఓడించి, రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకూ ఎవరూ విశ్రమించొద్దని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement