రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
అప్రమత్తమైన పోలీసులు
మంగపేట, మార్చి 23 (ప్రభ న్యూస్) : మహరాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ రేపు (ఆదివారం) తెలంగాణ రాష్ట్ర బంద్ కు మావోయిస్టులు ఇచ్చిన పిలుపు నేపధ్యంలో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్, తిమ్మంపేట క్రాస్ రోడ్, కోమటిపల్లి క్రాస్ రోడ్, కమలాపురం, ఏటూరునాగారం ఐటీడీఏ క్రాస్ రోడ్, ఏటూరునాగారం వై జంక్షన్, ముళ్ళకట్ట బ్రిడ్జి వద్ద, జగన్నాధపురం క్రాస్ రోడ్, వెంకటాపురం, కన్నాయిగూడెం, లక్ష్మీపురం, గుట్టల గంగారం తదితర ప్రాంతాల్లో గత రెండు రోజలుగా రహదారలుపై వాహనాల తనిఖీల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
రహదారిపై వచ్చిపోయే వాహనాలను నిలిపి వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని, వాహనంలో ఉన్న సామానును పోలీసులు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నించి వారి వివరాలను తెలుసుకుంటున్నారు. మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం – బూర్గంపహాడ్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్ లకు సంబంధించిన ఎలాంటి సమాచరమైనా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని ప్రశాంతమైన జీవితాల్లో కష్టాలను తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి సహకరించినా, ఆశ్రయం ఇచ్చినా సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.