హైదరాబాద్, : ప్రైవేట్ విద్యాసంస్థలు.. కొన్ని అడ్డగోలు దోపిడీకి తెగబడ్డాయి. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. ఫీజుల దందాకు దిగాయి. రెండు, మూడు నెలల సమయమున్నా.. గత ఏడాది చెల్లించిన విధంగా పూర్తి ఫీజు చెల్లించాల్సిందేనని, మొత్తం ఫీజు చెల్లిం చాకే కాలేజీలోకి అడుగుపెట్టాలని.. పరీక్ష ఫీజులు కట్టాలని షరతులు పెట్టి వేధిస్తున్నా యి. ఫీజులపై ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ.. ప్రభుత్వం అనేక జీవోలు జారీ చేసినా, బహిరంగంగా హెచ్చరించినా.. రూల్స్ గీల్స్ జాన్తానై మా లెక్క మాదే.. మా ఫీజులు కట్టాల్సిందే అంటూ అనేక కాలేజీ లు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఫీజుల వేధింపులు భరించలేక.. ఇటీవల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసు కోగా, కాలేజీ ఫుల్ ఫీజు కడితేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటామంటూ మూడు మాసాల సమయానికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ‘కాలేజ్ ఫీజును పరీక్ష ఫీజుతో ముడిపెట్టొద్దు. ఎగ్జామ్ ఫీజు కట్టుకునే విషయంలో ఆయా కాలేజీలు ఎటువంటి షరతులు విధించకుండా విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజును కట్టించుకోవాలి. ఈ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం’ అని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చినా కొన్ని ప్రైవేట్ ఇంటర్ కళాశాలల యాజమాన్యా లు మాత్రం వాటిని బేఖాతర్ చేస్తూనే ముక్కుపిండి మరీ ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్ కళాశాలలు సైతం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే క్లాసులు ప్రారంభమైన మొదటి రోజు నుండే ఫీజుల దోపిడికి కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరలేపాయి. ఈసీఐఎల్‌లోని ఓ ప్రముఖ ఇంటర్ కళాశాల.. తరగతులు ప్రారంభమైన మొదటి రోజే ఫీజుల వసూళ్ల సాకుతో త్రైమాసిక పరీక్షలు పెట్టి… కాలేజీ ఫీజు కడితేనే పరీక్షలు రాయనిస్తానని విద్యార్థులకు షరతులు విధించింది. దీంతో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇక చేసేది లేక ఫీజులు కట్టారు. ఆ తరువాత ఇంటర్ వార్షిక పరీక్ష ఎగ్జామ్ ఫీజుకు కాలేజీ ఫీజుకు ముడిపెట్టి బ్యాలెన్స్ కాలేజీ ఫీజు కడితేనే ఎగ్జామ్ ఫీజును కట్టించుకుంటామని పేచి పెట్టారు. ఇలా ఈ ఒక్క కాళాశాలలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పరీక్ష ఫీజుతో ట్యూషన్ ఫీజును ముడిపెడుతూ మెజారిటీ ప్రైవేట్ కళాశాలలు అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాలెన్స్ ఫీజులు కడితేనే.. కొత్త ఫీజుల చెల్లింపులు పూర్తయితేనే కాలేజీలకు ఎంట్రీ అంటూ షరతులు విధిస్తున్నాయి. లక్ష నుండి లక్షన్నర వరకు ఫీజులు కట్టించుకున్న తర్వాత అనేక కళాశాలలు విద్యార్థులను తమ కళాశాలల్లోకి అనుమతించి.. పూర్తి స్థాయి బోధన చేస్తున్నాయి. ఫీజు కట్టని వారిని, చెల్లించని వారిని తమకు సంబంధంలేదని చెబుతున్నాయి. పలు కళాశాలల్లో దీనిపై గొడవలు కూడా జరిగాయి. తల్లితండ్రులు వాగ్వాదాలకు దిగి.. అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటనలు అనేకం.
ఎగ్జామ్ ఫీజు కట్టుకునే విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇంటర్ బోర్డుకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పరీక్ష ఫీజుతో కళాశాల ఫీజును ముడిపెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలను అధికారులు జారీ చేశారు. అయితే అధికారులు ఇచ్చిన ఈ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడంలేదని, అవి అమలయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పరీక్ష ఫీజుతో కాలేజీ ఫీజును ముడిపెట్టి కళాశాల యాజమాన్యాలు ఇష్టారీతిన విద్యార్థు నుంచి ఫీజు వసూలు చేసే అవకాశం ఉందనే ఆలోచనలతో అందుకు ఇంటర్ బోర్డు ఈ సారి కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీ ఫీజుతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లోనే విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజును కట్టుకోవ చ్చని తెలిపింది. అయితే ఆన్‌లైన్‌లో విద్యార్థులు తమ వివరాలన్నీ నమోదు చేసేం దుకు కావాల్సిన లాగిన్ ఐడీని మాత్రం కళాశా లలకు అప్పగించింది. దీన్ని అవకాశంగా మలుచుకుని మెజారిటీ కాలేజీలు కాలేజీ ఫీజు కడితేనే పరీక్ష ఫీజు చెల్లించేందుకు లాగిన్ ఐడీ ఇస్తామని విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలా ఒకదానికొకటి ముడిపెడుతూ విద్యార్థుల నుంచి ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
రూ. లక్ష కొట్టు – కాలు పెట్టు..
Advertisement
తాజా వార్తలు
Advertisement