హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసి తాజాగా జరపాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి ఫలితాలను ప్రకటించింది.
అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే బయటకు పొక్కడం, సర్వీస్ కమిషన్ కార్యాలయంలో పని చేసినవారే ప్రశ్నపత్రాలను లీక్ చేసి అభ్యర్థులకు విక్రయించిన వైనాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ విచారణలో తవ్వేకొద్దీ అనేక అక్రమాలు వెలుగుచూశాయి. గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని సిట్ తేల్చడంతో అక్టోబరు 16న నిర్వహించిన పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసి తిరిగి జూన్ 11న నిర్వహించింది.
రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో 2లక్షల33వేల506 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. ప్రాథమిక కీ విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ జూన్ 22న ముగ్గురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. జూన్ 11 నాటి పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఓఎంఆర్ సమాధాన పత్రంపై హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకపోవడంపై పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేశారు. అక్టోబరు 16న నిర్వహించిన పద్ధతిలోనే జూన్ 11న పరీక్ష జరపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. గ్రూప్-1 నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాలకు భిన్నంగా పరీక్ష నిర్వహించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎ.గిరిధర్ రావు, నర్సింగ్ వాదించారు.
పోటీ పరీక్షలకు సంబంధించి జాతీయ స్థాయిలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అమలు చేస్తున్న విధివిధానాలనే అమలు చేస్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, టీఎస్పీఎస్సీ న్యాయవాది రాంగోపాల్‌రావు వాదించారు. కొందరు అభ్యర్థులే హైకోర్టుకు వచ్చారని.. మిగతా లక్షల మంది అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. అభ్యర్థిని నిర్ధారించేందుకు.. అవకతవకలు జరగకుండా అనేక విధానాలు పాటించామని పేర్కొంది. ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీ దేవి శనివారం తీర్పు వెల్లడించారు.
అభ్యర్థుల ఆందోళన
గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దు కావడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ ఏ మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పరీక్షను రెండు దఫాలు రాశామని.. ఇంకెన్నిసార్లు రాయాలని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతోంది. తీర్పు ప్రతిని వెంటనే ఇవ్వాలని టీఎస్పీఎస్సీ న్యాయవాది హైకోర్టును కోరారు. తీర్పు పూర్తి వివరాలు అధ్యయనం చేసిన తర్వాత.. సోమవారం లేదా మంగళవారం హైకోర్టు డివిజన్ బెంచి వద్ద అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
పరీక్ష నిర్వహణలో ఎందుకింత నిర్లక్ష్యం?
రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్పీఎస్సీపై హైకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్ షీట్లపై హాల్‌టికెట్ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణ జులైకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు చేయలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి.ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
వాదనలు ఇలా..
టీఎస్పీఎస్సీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ ఎం.రాంగోపాల్ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు.
అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్ కార్డు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు.
ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మాత్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది.