హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్ పై గురువారం వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును శుక్రవారం నాటికి రిజర్వు చేసింది. తమ సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 9న తొలి విడత వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వివరణ కోరింది. బీజేపీ ఎమ్మెల్యేల తరపున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అసెంబ్లీలో నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ స్పీకర్ నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని తెలిపారు.
చట్ట సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయవచ్చు కానీ ఇక్కడ అలా జరగలేదని ప్రస్తావించారు. ఆరోపణలను నిర్ధారించుకునేందుకు ప్రోసీడింగ్స్ కాపీని కోరగా.. ప్రోసీడింగ్స్ కాపీ ఇవ్వడానికి కుదరదని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ అభ్యంతరం తెలపగా కోర్టు ఆంగీకరించలేదు. ప్రోసీడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను పూర్తి చేసింది. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసింది.