శని , ఆదివారాలలో కూల్చివేతలా
కామన్ మ్యాన్ విశ్రాంతి తీసుకునే రోజులలో మానసిక క్షోభ
సెలవు రోజులలో కూల్చివేతలు వద్దని తీర్పులున్నాయి
కనీసం రూల్స్ కూడా పాటించారా
కోర్టు లో ఉన్న భవనాలను సైతం కూల్చివేస్తారా
తహాశీల్డార్ కోరితే ఛార్మినార్ ను డిమాలిష్ చేస్తారా
ఇలాగే అయితే హైడ్రా చట్టానికే బ్రేకులు వేస్తాం
పొలిటికల్ బాస్ ల కోసం కూల్చివేతలొద్దు
అక్రమ నిర్మాణాలు అయితే సీజ్ చేయండి
అ పని చేయాల్సింది రెవెన్యూ యంత్రాంగం
హైడ్రా ఏర్పాటు మంచిదే… పని తీరే అభ్యంతరకరం
పనితీరుపై పూర్తి నివేదిక ఇవ్వండి
తెలంగాణ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏర్పాటు మంచిదే అని అంటూ సంస్థ పనితీరు నిబందనలకు అనుగుణంగా లేదని వ్యాఖ్యానించింది.. వివరాలలోకి వెళితే అన్ని అనుమతులు పొంది, ఆస్తులు విక్రయించి, అప్పులు తెచ్చి హాస్పిటల్ కోసం ఐదంతస్తుల భవనాన్ని నిర్మించామని.. భూ ఆక్రమణ చట్టం-1905 కింద 48 గంటల నోటీసు ఇచ్చి 13 గంటల్లో భవనాన్ని కూల్చేశారని పేర్కొంటూ మహమ్మద్ రఫీ, ఎన్.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్ 27) విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును గత విచారణలో హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ భవనాన్ని ఎలా కూల్చారని నిలదీసింది. ఏ అధికారం, ఏ చట్టప్రకారం ఇళ్ల కూలివేతలు చేపడుతున్నారో చెప్పాలంటూ హైడ్రాకు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణకు కమిషనర్ రంగనాథ్, అమీన్‌పూర్ తహసీల్దార్ ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ ఈ నెల 30న హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలో అమీన్ పూర్ తహశీల్దార్ నేరుగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు విచారణలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండగా, జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ భవనాన్ని ఈ నెల 22న కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆదివారం నాడు కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాధితులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం 7.30 గంటలకు కూల్చివేతలు చేపట్టడం అక్రమమని పేర్కొంది. ఏ అధికారంతో ఇలా చేస్తున్నారో స్వయంగా వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది
”రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా?” అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వాదనల సందర్భంగా ఆదివారం కూల్చేయొచ్చా అని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని సూచించింది. కాగా, అమీన్ పూర్ తహసీల్దార్ 21వ తేదీన డిమాలిష్ కోసం మిషనరీ కావాలంటూ లేఖ రాశారని కోర్టుకు హైడ్రా కమిషనర్ తెలిపారు. మిషనరీ, మ్యాన్ పవర్ మాత్రమే పంపామని, ఎలాంటి కూల్చివేతలు చేయలేదని వివరణ ఇచ్చారు. దీనిపై ‘‘చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా.. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి… జంప్ చేయకండి. అమీన్ పూర్‌పై మాత్రమే మాట్లాడండి… కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు ’’ అంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురకంటించింది. . హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.
”ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది?పొలిటికల్ బాస్‌లను సంతృప్తిపరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా? ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అధికారులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు.. జాగ్రత్త అంటూ కాస్త కఠినంగా హెచ్చరించింది.
పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని.. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్‌ను గట్టిగా నిలదీసింది ధర్మాసనం.
హైడ్రా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెడుతున్నట్లు హైకోర్టు భావిస్తుందన్నారు. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని.. లేదా సీజ్ చేయాలని… కానీ నిబంధనలు ఉల్లగించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపకుండా అధికారులు కక్షగట్టి కూల్చివేస్తున్నారని మండిపడింది. ‘‘హైడ్రాను అభినందిస్తున్నాం.. కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాగులేదు’’ అని హైకోర్టు పేర్కొంది.
కామన్ మ్యాన్‌కు ఏం మెసేజ్ ఇస్తున్నారు..
‘‘అంత హడావుడి ఎందుకు ఆదివారం కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామపంచాయతీ స్పందించాలి.. గ్రామపంచాయతీ చర్యలు తీసుకోవాలి..కట్టకుండా.. కడితే సీజ్ చెయ్యాలి.. నిబంధనలు ఫాలో కావాలి.. హైడ్రా అభినందనీయం కానీ.. రూల్స్ ఫాలో కావాలి.. ఆదివారం కూల్చివేతలు సరికావు.. ఆదివారం కూల్చివేతలపై కామన్ మ్యాన్‌కు ఏమని మేసేజ్ ఇస్తున్నారు.. చార్మినార్ తహసీల్దార్ హైకోర్టును కూల్చలంటే హైడ్ర మేషనరీ పంపిస్తారా.. తహసీల్దార్, హైడ్రా కౌంటర్ దాఖలు చేయండి’’ అంటూ ఆదేశించింది.
ఒక్కరోజులో మార్పురాదు
మూసీపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచాం. జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయి. మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి పెట్టారు. ట్రాఫిక్ సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉంది. కానీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మాదాపూర్‌లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా? నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుంది. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తేనే సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారు. స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోంది. ఆదివారం కూల్చివేతలు వద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఉంది. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్ చేయవచ్చు కదా? హైడ్రా ఏర్పాటు అభినందనీయం.. పనితీరే అభ్యంతరకరం. అమీన్‌పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్ తీరు అసంతృప్తికరం. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదు. ఎఫ్టీఎల్ నిర్ధరించకుండా అక్రమాలు అని ఎలా తేలుస్తారు?” అని హైకోర్టు ప్రశ్నించింది.
హైడ్రా పనితీరుపై అసంతృప్తి
‘‘హైడ్రా విషయంలో మేము హ్యపీగా లేము. హైడ్రా ఏర్పాటు మీద రెండు పిటిషన్‌లు ఉన్నాయి. ఇష్టానుసారంగా చేస్తే జీవో 99 పై స్టే విధించాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా. హైడ్రా అంటే కేవలం కూల్చివేత చేయడమేనా. ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దు. పెద్ద, పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా లేదా నిజయితీగా చెప్పండి. ట్రాఫిక్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు. మూసి విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి. మూసి మీద ఈరోజు 20 పిటిషన్‌లు ఉన్నాయి’’ అని హైకోర్టు పేర్కొంది. అలాగే హైడ్రా కమిషనర్ , అమీన్ పూర్ ఎమ్‌ఆర్‌వోకు కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా, అమీన్‌ఫూర్ తహసీల్దార్‌ను ఆదేశించింది.