ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను రేపటి వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు బుధవారం హైడ్రాను ఆదేశించింది. ఈ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చివేసే అవకాశముందని భావించిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం వరకు స్టే విధించింది.
పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. హైడ్రా లీగల్ స్టేటస్, విధివిధానాలను చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగింది. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే… హైడ్రా ఏర్పాటు, కమిషనర్‌కు ఉన్న పరిధులను ప్రశ్నించింది.
హైడ్రా… ఓఆర్ఆర్ పరిధిలో పని చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి ఇది పని చేస్తుందన్నారు. హైడ్రా జీవో 111 పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
అయితే నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తూ… మరో శాఖ కూల్చివేస్తుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్ల క్రితం నాటి నిర్మాణాలను హైడ్రా ఇప్పుడు కూలుస్తోందని హైకోర్టు పేర్కొంది.
ఆగస్ట్ 14న కొంతమంది అధికారులు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చివేస్తామని బెదిరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జన్వాడ ఫామ్ హౌస్‌కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశించింది. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకు హైడ్రా నడుచుకోవాలని పేర్కొంది.