హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్)లో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పీవోపీతో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనంపై గత ఏడాది ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు కొట్టివేయాలని వారంతా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారించిన ధర్మాసనం ఎట్టిపరిస్థితుల్లోనూ నిషేదం ఎత్తివేయబోమంటూ స్పష్టం చేసింది.
పీఓపీ విగ్రహాలను కృత్రిమ కొలనుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని గత ఏడాదే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హామీ ఇచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 25వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 18న వినాయక చవితిని నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని గణష్ ఉత్సవ కమిటీ- నిర్ణయం తీసుకుంది.