Wednesday, November 27, 2024

Breaking : మాగనూర్ ఘటనపై హైకోర్టు సీరియస్..

ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
అధికారులు నిద్ర‌పోతున్నారా?
వారం రోజుల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశం
మాగనూరులో మరోసారి ఫుడ్‌ పాయిజన్‌
31 మంది విద్యార్థుల అస్వ‌స్థ‌త‌
ఇద్ద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
నారాయ‌ణ‌పేట జిల్లా మాగ‌నూరులో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని మండిపడింది. హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అన్నారు. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఇస్తే కానీ అధికారులకు పనిచేయడం చేతకాదా? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

శైల‌జ చితి ఆర‌క ముందే… రాష్ట్రంలో మ‌రో ఘ‌ట‌న‌

తెలంగాణ‌లో ఫుడ్ పాయిజ‌న్‌తో మృతి చెందిన ఓ విద్యార్థిని శైల‌జ చితి మంట ఆర‌క‌ముందే రాష్ట్రంలో మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. గత వారమే పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన సంఘటన మరువక ముందే అదే పాఠ‌శాల‌లో మంగళవారం కూడా ఫుడ్‌ పాయిజన్ జ‌ర‌గ‌డం నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సంఘ‌ట‌న హైకోర్టుకు చేరింది.

31 మంది విద్యార్థుల అస్వ‌స్థ‌త‌… ఇద్ద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం

- Advertisement -

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠశాలలో గత బుధవారం ఫుడ్‌ పాయిజన్‌ జరిగి వంద మంది విద్యార్థులు అస్వస్థకు గురై, అందులో 15 మంది విద్యార్థులు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందార‌ని సంగ‌తి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్న భోజనం తినిన 31 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు వంకాయ, సాంబార్‌ తో కూడిన ఆహారాన్ని అందించారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థులను స్థానిక‌ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మక్తల్‌ ప్రభుత్వాసుపత్రిలో ముందుగా 28 మంది విద్యార్థులు చికిత్స పొందగా అందులో నేత్ర అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జనరల్‌ ఆస్పత్రికి ఐదున్నర గంటల ప్రాంతంలో అంబులెన్స్‌ లో తరలించారు. దీపిక అనే 9వ తరగతి విద్యార్థిని పల్స్‌ పడిపోవ‌డంతో 6:45 గంటల ప్రాంతంలో అంబులెన్స్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వారం రోజుల్లో మూడోసారి

వారం రోజుల్లో మూడోసారి మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురికావ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత బుధవారం సంఘ‌ట‌న‌ జరిగిన అనంతరం అధికారులు అప్పటి వరకు వంట ఏజెన్సీ నిర్వహిస్తున్న ఏజెన్సీ సభ్యులను తొలగించారు. స్టాక్‌ ఉన్న బియ్యం కూడా తొలగించి కొత్తగా బియ్యం స్టాక్‌ ను పంపించారు. వారం రోజులుగా అధికారులు దగ్గరుండి వంట చేయించి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం భోజనం చేశాక కొద్దిసేపటి తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement