హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు తెలంగాణ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. కోర్టు తుదితీర్పుకు లోబడే క్రమబద్ధీకరణ చర్యలు మొదలుపెట్టాలని స్పష్టం చేసింది. అప్పటివరకు అంతర్గత ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని, అభ్యర్థులకు ఆర్డర్ కాపీలు ఇవ్వొద్దని ప్రభుత్వానికి సూ చించింది. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీక రణను నిరుద్యోగులు గతంలోనే హైకోర్టులో సవాల్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో 16, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌లో వచ్చిన జీవో 18లను రద్దు కోరుతూ వేసిన పిటిషన్‌లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీవీ ప్రసాద్ వాదనలు వినిపించారు. క్రమబద్దీకరణ ప్రక్రియకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేశారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇంకొంత కాలం ఆగాలని సూచించింది. ప్రభుత్వం రెగ్యులరైజ్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేసుకోవచ్చన్న స్పష్టం చేస్తూ, రెగ్యులర్ పోస్టింగ్ ఆర్డర్స్‌ను ఎవరికీ ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. తాజాగా గత నెల 30న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచి వాలయ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా తన కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆరు ఫైళ్ళపై సంతకం చేచిన విషయం తెలిసిందే. అందులో అత్యంత కీలకమైన నిర్ణయంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశం ఉంది.