Monday, November 25, 2024

High Court – ఎమ్మెల్యే పల్లాకు బిగ్ రిలీఫ్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెడుతోందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు..

చెరువు శిఖం భూమిలో అనురాగ్ కాలేజీ నిర్మించారంటూ ఆయనపై కేసు నమోదు కాగా.. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిబంధల ప్రకారం నడుచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టులో వాదనలకు ముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనను, అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత కక్షపూరితంగా వ్యవహరించినా తాను మాత్రం చట్ట ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు.

- Advertisement -

అనుమతులు ఉన్నాయి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..”అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణానికి చట్ట ప్రకారం అన్నీ అనుమతులు తెచ్చుకున్నా. ఆగస్టు 22, 2024న ఇరిగేషన్ ఇంజినీర్ మా విశ్వవిద్యాలయాన్ని పరిశీలించారు. మరుసటి రోజు గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు నాదం చెరువు బఫర్ జోన్‌లో ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మమ్మల్ని కనీస సమాచారం అడగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు గత 25ఏళ్లల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టలేదు. గతంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి పరిశీలించి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో లేవంటూ ఎన్‌వోసీ ఇచ్చారు. 2018లో అప్పటి మేడ్చల్ కలెక్టర్ జిల్లాస్థాయి కమిటీ వేసి పరిశీలించిన తర్వాతే ఎన్‌వోసీ ఇచ్చారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్‌పోర్ట్ అథారిటీలు అన్నీ ఎన్‌వోసీలు ఇచ్చాయి. అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అన్ని శాఖల అనుమతులు పరిశీలించిన తర్వాతే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.

అక్రమంగా కేసులు..

అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నాపై, నా సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జనగామలో వ్యక్తిగతంగా నాపై నాలుగు కేసులు, హైదరాబాద్‌లో రెండు కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనురాగ్ యూనివర్సిటీపై అన్ని శాఖలతో నిత్యం సోదాలు చేయిస్తున్నారు. ఏమీ దొరక్కపోవడంతో 2017లో అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి నాపై మరో కేసు నమోదు చేయించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా చట్ట పరిధిలో న్యాయం కోసం పోరాటం చేస్తా” అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement