హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లోని పంచాయితీలపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహారించే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో టీ పీసీసీ క్రమశిక్షణ కమిటి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. లాయలిస్ట్ కాంగ్రెస్ పేరుతో సమావేశం నిర్వహించిన సీనియర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు ఏకపక్షంగా ఉందని కొంత మంది సీనియర్లు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రత్యేక సమావేశం వద్దని, ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుందామని ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు పోను చేశారు. అయినప్పటికి కొందరు నాయకులు సమావేశం కావడంతో అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసిందని, రెండు రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కాగా, మంత్రి హరీష్‌రావుతో పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు భేటీపైన టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్గీయులు ఆరా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హనుమంతరావు మాత్రం ఇప్పటికే స్పందిస్తూ తాను వ్యక్తిగత పని కోసం వెళ్లడం జరిగిందని, అందులో ఎలాంటి రాజకీయం లేదని, కొంత మంది కావాలనే వివాదం చేస్తున్నారని చెబుతున్నారు. తాము నిర్వహించిన సమావేశం పార్టీ బాగు కోసమే తప్ప.. నష్టం చేయడానికి కాదని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డితో పాటు మరికొందరు కూడా వివరించారు. కాంగ్రెస్‌కు లాయల్టిగా చెప్పుకునే నేతలు పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహారిస్తున్నారని మరొక వర్గం వాదిస్తోంది. ఈ వివాదాలను పరిష్కరించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి బోసు రాజు తెలంగాణకు రానున్నారు. ఇరు వర్గాలను కూర్చొబెట్టి బోసు రాజు మాట్లాడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బోసు రాజు వచ్చే వరకు సీనియర్లకు షోకాజ్ నోటిసు ఇస్తారా..? లేదా అనేది సస్పెన్షన్‌గా మిగిలింది. షోకాజ్ నోటిసు ఇస్తే సమాధానం చెబుతామని సీనియర్లు అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..