రామగిరి (ప్రభన్యూస్): నేచురల్ స్థార్ నాని సింగరేణి ప్రాంతంలో సందడి చేయనున్నారు. నాని, కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కనున్న ‘దసరా’ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం పెద్దపెల్లి జిల్లాలోని సింగరేణి సంస్థ ఆర్జీ3 ఏరియా ఓసీపీ2 ప్రాజెక్టును ఎంచుకున్నారు. పారిశ్రామిక ప్రాంత గ్రామాల జీవన విధానం కథాంశంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో దసరా సినిమా షూటింగ్ ఇక్కడ జరగనున్నట్లు తెలుస్తోంది.
శనివారం రాత్రి మొదలయ్యే షూటింగ్ ఈనెల 14 వరకు నిర్వహించడంతోపాటు కొన్ని పాటలకు సంబంధించి క్లిప్‌లను చిత్రీకరించనున్నట్లు వివరించారు. ఇప్పటికే షూటింగ్ జరిపేందుకు సెట్టింగ్ పనులు పూర్తి చేశారు. కాగా, సింగరేణి మాజీ కార్మికుడు ఓదెల చంద్రయ్య కుమారుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాకు డైరెక్టర్ కావడం విశేషం.