చిత్రపురి అక్రమాలు గురించి ప్రశ్నిస్తే
తనపై కేసులా అంటూ మండిపాటు
సాక్షాత్తు ఆ కమిటి వారే గవర్నర్ కు ఫిర్యాదు
గతాన్ని గుర్తు చేసిన క్రిశాంక్
అక్రమాల నిరూపణకు ఏ కోర్టుకెళ్లేందుకైనా సిద్దం
హైదరాబాద్ : చిత్రపురి సొసైటీలో రూ.3 వేల కోట్ల భూదందాకు పాల్పడిన అనుముల మహానంద రెడ్డికి తనకు ఏం సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలరా..? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు. భూదందాకు సంబంధించిన పోస్టు పెట్టినందుకు మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ పోలీసులు నిన్న కేసు నమోదు చేసి, ఆయన ఫోన్‌ను సీజ్ చేశారు.
దీనిపై నేడు క్రిశాంక్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ… చిత్రపురి సొసైటీలో రూ.3 వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయన్నారు. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించగలరా ? అని ప్రశ్నించారు… ఆయన ఎవరో మాకు తెలియదు.. ఆయనను అసలు చూడనే చూడలేదు అని వాదిస్తున్నారని, ఆయనతో పరిచయమే లేకపోతే, ఆయనను చూడకపోతే ఈ ఫొటోలు ఎలా వస్తాయి..? అంటూ రేవంత్ తో మహానందరెడ్డి కలసి ఉన్న ఫోటోలను విడుదల చేశారు.. కోర్టుకు వచ్చి ఈ ఫొటో తప్పని నిరూపించగలరా..? అంటూ దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టు.. ఏ కోర్టుకైనా సరే వెళ్దామని అన్నారు…
తామే కాదని, చిత్రపురి సాధన సమితి వారు కూడా ఈ భూదందాపై గతంలో ప్రశ్నించారని గుర్తు చేశారు.. ఈ భూదందాలపై మాజీ గవర్నర్ తమిళిసైకి కూడా చిత్రపురి సాధన సమితి వారు ట్వీట్ చేశారని పేర్కొన్నారు. ఇందులో రూ.3 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. చిత్రపురి సిటీపై కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రశ్నించిన వాటిపై మళ్లీ తాము ప్రశ్నించినందుకు తన మీద కేసు నమోదు చేసి.. ఫోన్‌ను కూడా సీజ్ చేశారని, ఇదెక్కడి నాయమంటూ రేవంత్ ను నిలదీశారు..