Friday, November 22, 2024

వరద బాధితులకు అండగా కోలేటి.. నిత్యావసరాల కిట్లతో చేయూత

గోదావరిఖని టౌన్‌, (ప్రభన్యూస్‌): రామగుండంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందుల్లో ఉన్న వరద బాధితులకు కోలేటి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ అండగా నిలిచారు. గురువారం రామగుండం పరిసర ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన కోలేటి దామోదర్‌ బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు. బాధితులకు వెంటనే తనవంతుగా సహాయం చేయాలని సంకల్పించిన ఆయన వెయ్యి రూపాయలు పైచిలుకు ఖరీదు చేసే నిత్యావసరాల వస్తువుల కిట్లను 4వేలు తయారు చేయించి అందించారు. ఒక్కో కిట్‌లో 10 కిలోల బియ్యం, అరకిలో కందిపప్పు, చక్కర, బెల్లం, చింతపండు, నూనె, ప్లేట్‌, గ్లాస్‌ వంటి 18 నిత్యావసరాల వస్తువులను కోలేటి ఫౌండేషన్‌ ద్వారా అందించే ఏర్పాట్లు చేశారు. కిట్లను దామోదర్‌ స్వయంగా అంతర్గాం, పాత రామగుండం, పాములపేట ప్రాంతాలలో 500 మందికి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి కేసిఆర్‌ వరదల్లో చిక్కుకున్న వారెవరూ ఆహారం, నిత్యావసరాలు అందక బాధపడకూడదని, అవకాశమున్నవారంతా బాధితులను ఆదుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు తనవంతు సహాయం చేస్తున్నట్లు దామోదర్‌ తెలిపారు. రామగుండం, పరిసర ప్రాంతాల్లోనూ వరదల్లో చిక్కుకున్న పేదవారికి చేత నైన సహాయం చేయడం తన కర్తవ్యంగా భావిస్తున్నట్లు వివరించారు. సామాజిక సేవ చేయడం తనకెంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ బద్రిరాజు, డా. లక్ష్మీరాజ్యం, అన్వేష్‌, భరత్‌, రమేష్‌, సాయి, రాజయ్య, కే.పి. రాజు, టీ-ఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement