హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతితో.. సమయాన్ని ఆదా చేసేందుకు మాత్రమే హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే తానూ కూడా పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, సమీక్షా సమావేశాలకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతితోనే హెలికాప్టర్ సేవలను వినియోగించుకున్నట్టు తెలిపారు.
వరదల సమయంలో కేంద్ర మంత్రుల పర్యటనలకు, సహాయ పునరావాస కార్యక్రమాలకు, గణేష్ నిమజ్జనాన్ని సజావుగా నిర్వహించేందుకు హెలికాప్టర్ సేవలను వినియోగించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత నాలుగు నెలల్లో తాను, ఇతర మంత్రులు 7 సార్లు హెలికాప్టర్ సేవలను వినియోగించుకున్నారని కోమటిరెడ్డి తెలియజేశారు.
ఇతర మంత్రులతో అధికారిక సమావేశాలకు వెళ్లేందుకు తనకు గానీ, ఇతర మంత్రులకు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ సేవలను వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి నిరాకరించలేదని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.