వేములవాడ (ప్రభా న్యూస్) దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస శోభ సంతరించుకుంది. శ్రావణమాసం ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆదివారం రాజరాజేశ్వర స్వామిని 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. కోడే మొక్కులు, అభిషేకం, కళ్యాణం ,కుంకుమ పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో ఉన్న దర్గాను సైతం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల్లో శ్రావణమాసం ముగియడంతో స్వామివారి సన్నిధికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల ద్వారా, వివిధ మొక్కులు, ఆర్జిత సేవల ద్వారా సుమారు 30 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జీవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.