హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాయల సీమ, తెలంగాణ, విదర్భ మీదుగా బంగాళా ఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఛత్తీస్ గఢ్, ఒడిశా వరకు ఈ తుపాను విస్తరించి ఉంది. బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఏర్పడిన మరో ద్రోణి కూడా బలహీన పడింది. ఈ క్రమంలో అధికా రులు మరోసారి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆ జిల్లాలతో పాటు- హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్‌లో వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ రాడార్ కేంద్రం వెల్లడించింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేసింది. దీంతో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఈ ద్రోణుల ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నేడు తెలంగాణలో భారీ వర్షాలు
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. ఈ కారణంగా ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు- పలుచోట్ల వడగళ్ల వాన, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.
వాతావరణంలో విపరీతమై మార్పు
ఢిల్లీలోని వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఉత్తర భారతదేశంలోని వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది సమయానికి ముందే ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతల బలమైన ప్రభావం కనిపించింది. తాజాగా పాకిస్తాన్లో ఏర్పడిన తుపాను కారణంగా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో ఊహించని మార్పు వచ్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మార్చి నెలలోనే వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.