Friday, November 22, 2024

భారీ వర్షానికి తడిసి ముద్దైన భాగ్యనగరం

నైరుతి రాకతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం రాజధాని హైదరాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఏకదాటిగా కురిసిన భారీ వ‌ర్షానికి భాగ్య‌న‌గ‌రం త‌డిసి ముద్ద‌యింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఉప్ప‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, రామంతాపూర్‌, తార్నాక, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్ త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు పారుతుండ‌టంతో వాహనదారులు ఇక్కడ్లు పడ్డారు. ప‌లుచోట్ల రోడ్ల‌పై నీరు నిలిచిపోయింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేరింది.

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధ‌వారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ నుంచి తెలం‌గాణ మీదుగా దక్షిణ తమి‌ళ‌నా‌డు వ‌రకు సముద్రమట్టానికి 0.9 కిలో‌మీ‌టర్ల వద్ద ఉప‌రి‌త‌ల‌ద్రోణి ఆవ‌రించి ఉంది. అదేవిధంగా ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలో‌మీ‌టర్ల ఎత్తులో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభా‌వంతో గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement